Commercial LPG Cylinder Price : ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆగస్టు నెల ఆరంభంలో గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గిన ధరలు నేటి (ఆగస్టు 1) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
భారత్, ఇండేన్, హెచ్‌పీ మొదలైన కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రమే తగ్గించాయి. దీనితో ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.99.75 మేర తగ్గింది. ధరల తగ్గింపుతో ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ ధర దిల్లీలో రూ.1680కు చేరింది.
నోట్: సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో కమర్షియల్, డొమిస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రివిజన్ చేస్తుంటారు. అందులో భాగంగా చమురు ధరలను, గ్యాస్ ధరలను మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. అయితే వీటి ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే స్థానిక పన్నులు ఆధారంగా గ్యాస్, చమురు ధరల్లో కొద్ది పాటి మార్పులు వస్తూ ఉంటాయి.
వంట గ్యాస్ ధరలు
దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు.. ఎల్పీజీ సిలిండర్ (వంట గ్యాస్) ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. కోల్‌కతాలో రూ.1802.50; ముంబయిలో రూ.1640.50; చెన్నైలో రూ.1852.50గా ఉన్నాయి.
వాస్తవానికి జులై నెల ఆరంభంలో చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.7 మేర పెంచాయి. కానీ అప్పుడు కూడా వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
అంతర్జాతీయ ప్రభావం
భారతదేశం దేశీయ ఎల్పీజీ గ్యాస్ వినియోగం కోసం దాదాపు 60 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కనుక దేశంలోని ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో కూడా ముడిపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. అందువల్లనే అంతర్జాతీయంగా వచ్చిన ధరల మార్పును అనుసరించి మాత్రమే దేశీయ వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరల్లో కూడా మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఇదే విధంగా చమురు ధరల విషయంలోనూ జరుగుతుంది. అందుకే ప్రతి నెలలో చమురు ధరల్లోనూ మార్పులు వస్తుంటాయి.
సబ్సీడీ
వాస్తవానికి పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా చూసేందుకు.. ప్రభుత్వం అర్హులైన డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీని కూడా జమ చేస్తోంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీతో ఇస్తోంది. ముఖ్యంగా 14.2 కిలోల సిలిండర్‌పై రూ.200 వరకు సబ్సీడీ అందిస్తోంది.