అమెరికా నూతన అధ్యక్షునిగా బైడెన్ ప్రమాణస్వీకారం వేళ అమెరికన్ స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. ఇతర సానుకూల అంశాలు మార్కెట్ల వరుస ర్యాలీకి కారణమయ్యాయి. ప్రమాణ స్వీకారంతో పాటు.. కీలక ఉత్తర్వుల జారీ నేపథ్యంలో మార్కెట్లు ఆల్‌టైం హై కి చేరుతున్నాయి.
లాభాల్లో సూచీలు..
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు వరుస లాభాలతో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.1శాతం పెరిగి జీవితకాల గరిష్ఠమైన 3,842.03 వద్దకు చేరింది. డోజోన్స్ ఇండస్ట్రీయల్ సూచీ 221 పాయింట్లు(0.7శాతం) గరిష్ఠాన్ని తాకి 31,151 వద్ద స్థిరపడింది. ఇక నాస్డాక్ కాంపోజిట్ 1.8 శాతం అధికంగా ట్రేడ్ అవుతోంది.
సంక్షోంభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటన మదుపరులకు మరింత నమ్మకాన్నిచ్చింది. దీంతో లాభాలను ఆర్జిస్తూ నూతన గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి.
కరోనా కట్టడికి బైడెన్ ప్రాధాన్యం..
ప్రస్తుతం కరోనా విజృంభణతో నిరుద్యోగ భృతి కోసం పౌరులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అంతేగాక గిరాకీలు తగ్గి వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. విస్తృత టీకా కార్యక్రమంతో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఆస్కారముందన్న సంకేతాలతో వాల్ స్ట్రీట్‌లో వరుస లాభాలు నమోదవుతున్నాయి. శ్వేతసౌధంపై బైడెన్ నియంత్రణను స్టాక్ మార్కెట్ల పెరుగుదల సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ముందున్న సవాళ్లు