అంతర్జాతీయ చమురు మార్కెట్లు బుధవారమూ అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. తొలుత లాభపడిన బ్రెంట్ చమురు.. తిరిగి 12.31 శాతం పడిపోయింది. ఆరంభ లాభాలు ఆవిరై బ్యారెల్ ధర 16.98 డాలర్ల దిగువకు చేరింది.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా ఆరంభంలో 20 శాతం లాభపడినా.. మధ్యాహ్నానికి 5 శాతం మేర పడిపోయి బ్యారెల్ ధర 11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఆ ప్రభావం తాత్కాలికమే..
తక్కువ ధర వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం మార్కెట్లకు కలిసివచ్చింది. చమురు మార్కెట్ పరిస్థితిపై ఒపెక్ దేశాలు, వాటి భాగస్వామ్య పక్షాలు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించడమూ సానుకూల ప్రభావం చూపింది. అయితే ఈ చర్యలు తాత్కాలిక ధరల పెరుగుదలకే సహకరించాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గటం, రష్యా- ఒపెక్ దేశాల మధ్య చమురు యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. డబ్ల్యూటీఐ చమురు ధర -40 డాలర్లకు పడిపోగా.. బ్రెంట్ ధరలు 12 శాతం పడిపోయి 18 ఏళ్ల కనిష్ఠాన్ని నమోదు చేశాయి.
ఇదీ చూడండి: చమురు ధరలు తగ్గినా మనకు మంట తప్పదా!