అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఆటో, మెటల్స్, ఐటీ సహా కీలక రంగాల్లో క్షీణతతో దేశీయ సూచీలు(Stock market today) వరుసగా మూడోరోజూ నష్టాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు తమ సొమ్మును తరలించటమూ ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన పేటీఎం లిస్టింగ్ ప్రభావం సైతం ఉన్నట్లు తెలిపారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్(Sensex news) 372 పాయింట్ల నష్టంతో 59,636 వద్ద ముగిసింది.
- 59,969 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచే ఒడుదొడుకులకు లోనైంది. ఒకానొక దశలో 59,376 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 60,177 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 59,636 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ(Nifty today) 134 పాయింట్ల క్షీణతతో 17,765 వద్ద స్థిరపడింది.
- ఇంట్రాడేలో.. 17,890 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, ఒకానొక దశలో 17,945 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 17,765 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలతో ముగిశాయి.
టెక్ మహీంద్ర, ఎం&ఎం, హెచ్‌సీఎల్‌టెక్, టాటాస్టీల్, ఎల్అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 2.5 శాతానికిపైగా నష్టాలు మూటగట్టుకున్నాయి.
పేటీఎం డీలా
వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Paytm ipo price) (పేటీఎం మాతృ సంస్థ) ఆరంభంలోనే డీలాపడింది. గురువారం ఈ సంస్థ షేరు లిస్టింగ్‌కు రాగా.. ఇష్యూ ధర కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేరు ఇష్యూ(Paytm ipo price) ధరను రూ.2,150గా నిర్ణయించారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 9.30 శాతం తక్కువగా రూ.1950తో లిస్ట్ అయ్యింది. బీఎస్‌ఈలోనూ 9 శాతం తగ్గి రూ.1,955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పేటీఎం షేర్ విలువ మరింత కుంగి చివరకు 27 శాతం నష్టంతో రూ.1,564కు వద్ద స్థిరపడింది.