కరోనా సంక్షోభంతో వరుస పతనాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు నేడు గణనీయంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,028 పాయింట్లు పెరిగి 29,468 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 317 పాయింట్ల వృద్ధితో 8,598 వద్ద ముగిసింది.
లాభాలకు కారణాలివే...
దేశంలో కరోనా సంక్షోభం తీవ్రమవడం, ఆర్థిక వ్యవస్థలో మందగమనం మరింత పెరగడం వంటి ప్రతికూలతలు ఉన్నా.... తగ్గిన ధరల వద్ద వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపారు.
2 నెలల లాక్డౌన్ తర్వాత చైనాలో పరిస్థితులు చక్కబడి, పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ప్రారంభం కావడం... సానుకూల ప్రభావం చూపింది.
ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.
ఇండ్రాడే సాగిందిలా...
ఉదయం 29 వేల 295 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో 28 వేల 667 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. తర్వాత పుంజుకుని 29 వేల 771 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.
లాభనష్టాల్లో...
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ లాభపడ్డాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, మారుతి నష్టపోయాయి.