ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన వేళ మార్కెట్లు గురువారం భారీగా పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో షేర్ల కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు జరిపేందుకు మదుపురులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రష్యా చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షల్ని ప్రకటించాయి. ఇవి రష్యాను కొంతమేర నిలువరించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణం వల్ల.. గురువారం ఆరంభంలో భారీగా నష్టపోయిన అమెరికా సూచీలు ఆఖర్లో కొంత పుంజుకొని నష్టాల్ని పరిమితం చేసుకున్నాయి. అదే బాటలో పయనిస్తున్న ఆసియా మార్కెట్లు ప్రస్తుతానికి కొంత సానుకూలంగా కదలాడుతున్నాయి. మరోవైపు యుద్ధ భీతితో ప్రపంచవ్యాప్తంగా బాండ్ల రాబడులు గణనీయంగా పడిపోవడం కూడా సూచీలకు కలిసొచ్చింది.
అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి తప్పకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముడి చమురు ధరలు గరిష్ఠాల నుంచి కాస్త వెనక్కి వచ్చినప్పటికీ.. ఇంకా బ్యారెల్ ధర 100 డాలర్ల పైనే చలిస్తుండడం సూచీలను కలవరపెడుతోంది.
సెన్సెక్స్ ప్రస్తుతం 1310 పాయింట్లు ఎగబాకి 55,840 వద్ద కదలాడుతోంది.
నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 394 పాయింట్లు వృద్ధి చెంది.. 16,642 వద్ద ట్రేడవుతోంది.
ముప్పై షేర్ల ఇండెక్స్‌లో హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే మినహా మిగతా అన్నీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.