స్టాక్ మార్కెట్లు (Stocks today) సోమవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కరోనా కొత్త వేరియంట్ భయాలతో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 100 పాయింట్లకుపైగా లాభంతో.. 57,227 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 7 పాయింట్లు పెరిగి 17,033 వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, టెక్‌మహీంద్రా, ఎస్బీఐఎన్, టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్ షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్లను వెంటాడుతున్న ఒమిక్రాన్ భయాలు
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. దేశీయంగా కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ భయాలే పైచేయి సాధిస్తున్నాయి.
రిలయన్స్ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొస్తాయని భావించినప్పటికీ.. అవేవీ ప్రభావం చూపడం లేదు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ (B.1.1.529).. క్రమంగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దేశీయంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలు విదేశీ ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాలతో సూచీల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.