Stock Market: కఠిన ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యన్ స్టాక్ మార్కెట్లు మదుపునకు ప్రతికూలంగా మారాయి. దీంతో వరుసగా మూడోరోజైన బుధవారమూ అక్కడి క్యాపిటల్ మార్కెట్లు మూతపడ్డాయి. అయినప్పటికీ.. అక్కడి షేర్ల విలువ పతనమవుతుండడం గమనార్హం. విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన ఆ దేశ 'ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్' విలువ కుంగుతుండడమే అందుకు కారణం. దీంతో 10 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల్ని నిర్వహిస్తున్న బ్లాక్‌రాక్.. కొత్త ఫండ్ల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని మదుపర్లను హెచ్చరించింది. రష్యా కరెన్సీ పతనం, ఆ దేశ ప్రముఖ బ్యాంకులపై స్విఫ్ట్ నిషేధమే స్టాక్ మార్కెట్ల మూసివేతకు దారితీసింది. మరోవైపు రూబుల్ పతనాన్ని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలు కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు అడ్డంకిగా మారాయి.
- అమెరికా ఎక్స్ఛేంజీల్లో నమోదైన రష్యా షేర్ల ఆధారిత 'వానెక్ రష్యా ఈటీఎఫ్', 'ఐషేర్స్ ఎంఎస్‌సీఐ రష్యా ఈటీఎఫ్' ఫండ్ల విలువ దాదాపు 30 శాతానికి పైగా కుంగింది.
- దాదాపు 2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఫండ్ల విలువ 62 శాతానికి పైగా పడిపోయింది. బ్యాంకులపై ఆంక్షలు, వివిధ కంపెనీల్లోకి రావాల్సిన బిలియన్ డాలర్లు విలువ చేసే పెట్టుబడులు నిలిచిపోవడమే అందుకు కారణం.
- తీవ్ర ఒడుదొడుకుల నేపథ్యంలో ఐషేర్స్ ఎంఎస్‌సీఐ రష్యా ఈటీఎఫ్ కొత్త షేర్ల జారీని నిలిపివేయనున్నట్లు బ్లాక్‌రాక్ వెల్లడించింది.
- ఈటీఎఫ్‌ల మదుపు లక్ష్యాలను చేరుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని బ్లాక్‌రాక్ స్పష్టం చేసింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు సద్దుమగణడంతో పాటు రష్యన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు తెరుచుకునే వరకు గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది.
అదే జరిగితే భారత్‌కు లాభం..
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యన్ మార్కెట్లు పెట్టుబడికి అనువుగా లేవని స్పష్టమైంది. అయితే, ఇప్పటి వరకు రష్యన్ స్టాక్స్‌లో మదుపు చేయడంపై మాత్రం ఎలాంటి నియంత్రణలు లేవు. కానీ, అక్కడి స్టాక్ మార్కెట్ల మూసివేత, కఠిన ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్లయిన ఎంఎస్‌సీఐ, ఎఫ్‌టీఎస్‌ఈ సూచీల నుంచి అక్కడి దేశీయ స్టాక్‌లను తొలగించడం సహజ పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి కదలికలు లేని రష్యన్ స్టాక్‌లను కొనసాగించడంలో అర్థం లేదని ఎంఎస్‌సీఐ హెడ్ ఆఫ్ రీసెర్చి దిమిత్రిస్ మెలాస్ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఎంఎస్‌సీఐ లేదా ఎఫ్‌టీఎస్‌ఈ తమ సూచీల నుంచి రష్యన్ స్టాక్‌లను తొలగిస్తే అది భారత మార్కెట్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశీయ సూచీలు ఆరు శాతానికి పైగా దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో కనిష్ఠాలకు చేరుకొని మదుపునకు అనువుగా మారాయి. ఒకవేళ ఎంఎస్‌సీఐలో 2.3 శాతంగా రష్యా వెయిటేజీని సున్నాకు తగ్గిస్తే వర్దమాన మార్కెట్లయిన చైనా, తైవాన్, భారత్, కొరియా అత్యధికంగా లాభపడతాయి. భారత వెయిటేజీకి 25 బేసిస్ పాయింట్లు వచ్చి చేరతాయి. దీంతో మరో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.
ఇదీ చూడండి: మండుతున్న చమురు ధరలు.. భారత్‌లో ఇక పెట్రోల్ రేట్ల మోతే!