Share Market Closing today: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో జోష్ నింపింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు సూచీలను నడిపించాయి. ఐటీ షేర్లు సైతం రాణించడం వల్ల.. లాభాలు భారీగా నమోదయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 460 పాయింట్లు లాభపడింది. ఆర్బీఐ ప్రకటనకు ముందు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఓ దశలో 58,332 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అనంతరం పుంజుకొని 500 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ సాగించింది. చివరకు 58,926 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ విప్రో, పవర్ గ్రిడ్ తదిదర షేర్లు లాభాలు నమోదు చేశాయి. మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.
అటు నిఫ్టీ సైతం లాభాలతో ట్రేడింగ్ ముగించింది. 90 పాయింట్లు వృద్ధి చెంది 17,554 వద్ద స్థిరపడింది.
RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ వరుసగా పదోసారి యథాతథంగా ఉంచింది. 3 రోజుల సమీక్ష అనంతరం.. ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాలను గురువారం ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు కమిటీ సభ్యులు అంతా అంగీకరించారని వెల్లడించారు.
ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన- వరుసగా పదోసారీ..