బ్యాంకింగ్, వాహన రంగాలు, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం వల్ల ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వాహన రంగ నష్టాలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీయడం ఇందుకు మరోకారణం. విదేశీ మదుపరులు పెట్టుబడి ఉపసంహరణలను కొనసాగించడమూ దేశీయ మార్కెట్‌ను దెబ్బతీసింది.
బీఎస్సీ సెన్సెక్స్ 289.13 పాయింట్లు నష్టపోయి 37 వేల 397 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 103.80 పాయింట్లు కోల్పోయి 11 వేల 85 వద్ద నిలిచింది.
నష్టాల్లో..
యెస్ బ్యాంకు భారీగా 9.13 శాతం నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంకు 6.6 శాతం, హీరోమోటోకార్ప్ 6.01 శాతం, సన్‌ఫార్మా 4.79 శాతం, ఎస్బీఐ 4.70 శాతం నష్టాలు చవిచూశాయి.
టాటా స్టీల్, వేదాంత, టాటా మోటార్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా నష్టాల పాలయ్యాయి.
లాభాలతో గట్టెక్కాయ్..
భారతీ ఎయిర్టెల్ 3.19 శాతం, టీసీఎస్ 2.32 శాతం లాభాలు ఆర్జించాయి.
హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
ఆసియా మార్కెట్ల లాభాలు
అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో మిగతా ఆసియా మార్కెట్లు.. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, హాంగ్ సెంగ్, నిక్కీ, కోస్పీ లాభాలతో ముగిశాయి.
ఇదీ చూడండి: ఆగష్టు 7న భారత్ మార్కెట్లోకి 'వివో ఎస్1'