ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడడం ఖాయమన్న తాజా అంచనాలతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 50 పాయింట్ల లాభంతో 36 వేల 575 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 10 వేల 822 వద్ద కొనసాగుతోంది.
కారణాలు ఇవే...
- డ్రోన్ దాడుల నేపథ్యంలో నిలిచిన చమురు ఉత్పత్తిని సగం మేర పునరుద్ధరించినట్లు సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి చేసిన ప్రకటన సానుకూల ప్రభావం చూపింది. ఈ నెలాఖరులోగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న అంచనాలతో ఇంధన రంగాల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపారు.
- అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.
లాభనష్టాల్లో...
బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యస్బీఐ, యస్‌బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, వేదాంత, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 2శాతానికి పైగా వృద్ధి చెందాయి.
మారుతి, హీరో మోటార్స్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ షేర్లు 1.5 శాతం క్షీణించాయి.
ఇదీ చూడండి: కేంద్రం నుంచి త్వరలోనే భారీ ఉద్దీపన ప్యాకేజీ!