పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,677 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 11,993 పాయింట్ల వద్ద ముగిసింది.
అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోనే మార్కెట్లు కుదుపునకు లోనైనట్లు తెలుస్తోంది. ముడిచమురు ధర పెరుగుదలతో పాటు రూపాయి పతనం ప్రతికూల ప్రభావం చూపింది.
లాభాల్లోని షేర్లు
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం రెండు(టైటాన్, పవర్‌గ్రిడ్) మాత్రమే లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోయింది. నేటి ట్రేడింగ్‌లో 4.63 శాతం క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్‌తో పాటు ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టం చవిచూశాయి.
ముడి చమురు
ముడిచమురు బ్యారెల్ ధర దాదాపు 2 శాతం పెరిగి 69.81 అమెరికన్ డాలర్లకు చేరింది.
క్షీణించిన రూపాయి
రూపాయి సైతం భారీగా పతనమైంది. 24 పైసలు బలహీనపడి 72.04 అమెరికన్ డాలర్ల వద్ద ముగిసింది.
ఆసియా మార్కెట్లు
ఇరాన్-అమెరికా ఉద్రిక్త పరిస్థితులు ఆసియా మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించాయి. షాంఘై, హంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో ఉన్నాయి.