స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ భారీగా 600 పాయింట్లు కోల్పోయి.. 39,922 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,729 వద్ద స్థిరపడింది.
అమెరికా ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం వంటి పరిణామాలు కూడా నష్టాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టెలికాం, వానహ రంగాల్లోని కొన్ని కంపెనీలు మినహా దాదాపు అన్ని రంగాలు బుధవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,664 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,774 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,929 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,813 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, మారుతీ, ఎల్&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, కోస్పీ మినహా నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి 16 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 73.87 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 3.16 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 39.30 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఈ కామర్స్ జోరు- పండుగ విక్రయాలు 55% వృద్ధి!