ఆర్థిక మందగమనంపై భయాలు వెంటాడిన వేళ... స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలు కోల్పోయి, నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 80 పాయింట్లు తగ్గి 36,644 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ మాత్రం 3 పాయింట్లు లాభపడి 10,848 వద్ద ముగిసింది.
అలా మొదలైనా...
ఉదయం అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా స్పందించాయి. హాంకాంగ్ బిల్లు ఉపసంహరణ, అమెరికా-చైనా చర్చల పునరుద్ధరణ ప్రకటనల నేపథ్యంలో లాభాలతో రోజును ప్రారంభించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు అదే బాటలో పయనించాయి.
సంక్షోభంలో ఉన్న వాహన రంగానికి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం ఆటో షేర్ల కొనుగోళ్లకు ఊతమిచ్చింది. అయితే... ఈ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఐటీ రంగాల వాటాలపై అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ నష్టపోయింది.
లాభనష్టాల్లో...
మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, వేదాంత, టాటా స్టీల్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎస్ బ్యాంక్ 7.81 శాతం మేర లాభపడ్డాయి.
కాఫీడే, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కొటక్ బ్యాంక్ నష్టపోయాయి.
ముడిచమురు ధర బ్యారెల్కు 60.84 అమెరికా డాలర్లకు చేరుకుంది.
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'