స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 534 పాయింట్లు బలపడి 59,299 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 159 పాయింట్ల లాభంతో 17,691 వద్దకు చేరింది. దీనితో వరుసగా నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లయింది. సెషన్ ఆరంభం నుంచే బుల్ జోరు కొనసాగింది.
విద్యుత్, ఆర్థిక ఐటీ షేర్లు లాభాలను గడించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,548 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,952 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,750 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,581 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు భారీగా నష్టపోయాయి. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు సెలవులో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ అదుర్స్- రెండు రెట్లు వృద్ధి!