ETV Bharat / business

కొత్తదైనా... పాతదైనా... కారు కారే కదా!

కారు...మధ్య తరగతి కలల వాహనం. ఉద్యోగం వచ్చింది మొదలు ఎప్పుడెప్పుడు కారు కొందామా అని ఎదురు చూసేవారు ఒకప్పుడు. పెద్దలేమో ముందు సొంతిల్లు ఆ తర్వాతే కారు- అనేవారు. అప్పుడు కారు... విలాసం. ఇప్పుడది అవసరం. కరోనా ఆ అవసరాన్ని కాస్తా అత్యవసరంగా మార్చినట్లే ఉంది. కొత్తది కాకుంటే పాతదైనా సరే... కారంటూ ఉంటే క్షేమంగా బయటికెళ్లి రావచ్చనుకుంటున్నారు ప్రజలు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఒక్క ఓఎల్‌ఎక్స్‌లోనే సెకండ్‌ హ్యాండ్‌ కార్లకి డిమాండ్‌ పాతిక శాతం పెరిగిందట. అందుకేనేమో మామూలుగానే సందడిగా ఉండే పాత కార్ల మార్కెట్టు ఇప్పుడు మరింత జోరుగా ఉంది.

second-hand-car-sales-increased-gradually-due-to-corona
కొత్తదైనా... పాతదైనా... కారు కారే కదా!
author img

By

Published : Dec 13, 2020, 3:12 PM IST

ఫోనులో బుక్‌ చేస్తే నిమిషాల్లో ఇంటిముందు నిలిచే క్యాబ్‌ సర్వీసులు అందుబాటులో ఉండగా సొంత కారెందుకు డబ్బు దండగ కాకపోతే... అని నిన్నమొన్నటివరకూ కుటుంబసభ్యుల కారు డిమాండ్‌ని కొట్టిపడేసిన బడ్జెట్‌ పద్మనాభాలు కూడా ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లేమన్నా దొరుకుతాయేమోనని ఎంక్వైరీలు చేస్తున్నారు. కారులో షికార్లు తిరగాలని కలలు కనేవారికి ఆ కల నిజం చేసుకోవడం ఈరోజుల్లో పెద్ద కష్టం కాదు. రెండు లక్షలు పెడితే చాలు కండిషన్‌లో ఉన్న కారు వచ్చి ఇంటి ముందు వాలుతుంది... అని హామీ ఇస్తున్నారు డీలర్లు. ఇంకేం... కారు కొనేసుకుంటే పోలా అనుకుంటున్నారు మధ్య తరగతి వేతనజీవులు. పెరుగుతున్న పెట్రోలు ధరలూ, పన్నులూ ఏవీ ఇప్పుడు కారు కొనుగోళ్లకు అడ్డం కావటం లేదు.

ఒకప్పుడంటే- ఎన్నాళ్లో కష్టపడి ఖర్చులు తగ్గించుకుని బోలెడు డబ్బు దాచుకుని కారు కొనుక్కునే సాహసం చేసేవారు. వాడుక కూడా తక్కువే కాబట్టి ఆరోజుల్లో కొన్న కారు పదేళ్లు పడి ఉండేది. ఇప్పుడలా కాదు. కొత్త కారును కొన్నవాళ్లు మూడు నుంచి ఐదేళ్లలోనే దాన్ని అమ్మేస్తున్నారట. గత మూడు దశాబ్దాలుగా ఆదాయాలు పెరగడమూ, ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో రకరకాల మోడల్స్‌ని మార్కెట్లోకి తేవడమూ కలిసి కార్ల మార్కెట్‌ని బాగా పెంచాయి. మరో కొత్త మోడల్‌ కొనుక్కుందామనో లేక కుటుంబ అవసరాలకు సరిపోయేలా మరింత పెద్ద కారు తీసుకుందామనో చాలామంది మొదటి కార్లను అమ్మేస్తుంటారు. అలాంటి కార్లన్నీ సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లోకి చేరతాయి. దాంతో గత కొన్నేళ్లుగా ఈ మార్కెట్‌ బాగా పెరుగుతోంది. 2018-19 సంవత్సరంలో మనదేశంలో కొత్త కార్లు 36 లక్షలు అమ్ముడుపోతే పాతవి 42 లక్షలు అమ్ముడుపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అమ్ముడయ్యే ప్రతి నాలుగు కార్లలోనూ మూడు సెకండ్‌హ్యాండ్‌వి, ఒకటి మాత్రమే కొత్తదీ ఉండటం అభివృద్ధి చెందిన దేశాల్లో నడుస్తున్న ట్రెండ్‌. మనదేశంలోకీ ఆ ట్రెండ్‌ వచ్చేసినట్లేనని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

పాత కార్లకు అంత సీనా?

కారు విషయంలో పాతదనానికీ ఓ లెక్క ఉంది. ఒకసారి షోరూము నుంచి కొని ఇంటికి తెచ్చామంటే ఆ కొత్త కారు కాస్తా పాతదై పోతుంది. ఇక అప్పటినుంచి దాని విలువ తరుగుతూనే ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు చొప్పున ఆ పాతదనం పెరుగుతుంది. కొని ఏడాది తిరిగేసరికల్లా కారు విలువ ఇరవై శాతం తగ్గిపోతుందని నిపుణులు వేసే లెక్క. కొన్ని మోడల్స్‌కైతే ఏకంగా యాభైశాతం తగ్గించేస్తారు. అయితే విలువ తగ్గినంత మాత్రాన అది పనిచేయదని కాదు. చక్కగా వాడితే కారు ఎన్నో సంవత్సరాలు సేవలు అందిస్తుంది. అందుకే ధర తగ్గించి పాత కార్ల మార్కెట్‌లో మళ్లీ అమ్ముతుంటారు.

ఏ యాక్సిడెంట్లో చేసి ఉంటే..?

సెకండ్‌ హ్యాండ్‌ కారు అనగానే చాలామందికి అలాంటి అనుమానాలు ఉంటాయి. ప్రమాదాలకు కారణమైందేమో, దొంగతనానికి గురయిందేమో... లాంటి సందేహాలు వేధిస్తాయి. కొంతమందికి ఇతరులు వాడిన వస్తువు వాడటమూ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అలాంటివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే- సెకండ్‌ హ్యాండ్‌ కార్లు ఎంత పాతవైనా ఆ పాత వాసనలూ మరకలూ ఏవీ లేకుండా సరికొత్తగా ముస్తాబై మన ఇంటికి వస్తాయి. ఈ కార్లను అమ్మే డీలర్లు అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. కాబట్టే సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు గిరాకీ పెరుగుతోంది. ప్రి-ఓన్డ్‌ లేదా సెకండ్‌హ్యాండ్‌ కార్‌ మార్కెట్‌కి సంబంధించి పూర్తి అధికారిక సమాచారాన్ని ఇచ్చే ఇండియన్‌ బ్లూబుక్‌ నివేదిక ప్రకారం నాలుగైదేళ్లు వాడిన కార్లకు మన దేశంలో ఎక్కువ డిమాండు ఉంటోంది.

ఎక్కడ దొరుకుతాయి?

పెరుగుతున్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సంఖ్యనీ, వాటిని తిరిగి వాడుకలోకి తేవాల్సిన అవసరాన్నీ గుర్తించిన కార్ల కంపెనీలు ఇప్పుడు సొంతంగా వీటికోసం ప్రత్యేక షోరూమ్‌లను పెడుతున్నాయి. కొత్త కారు కొనేటప్పుడే పాత కారుని ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. అలా తీసుకున్న కార్లను పూర్తి మరమ్మతులు చేసి పాత కార్ల షోరూమ్‌లో అమ్మకానికి పెడతాయి. మారుతి వాళ్ల ట్రూవాల్యూ షోరూమ్‌లు అలాంటివే. దేశవ్యాప్తంగా 942 నగరాల్లో 1252 ఫ్రాంచైజీలు పెట్టి లక్షలాది వాహనాలను అమ్మింది ఈ సంస్థ. పాత కార్లకు ఏకంగా 376 చెక్‌పాయింట్స్‌ని పరీక్షించాకే అమ్మకానికి పెడుతుంది. అవసరమైన చోట ఒరిజినల్‌ విడి భాగాలనూ అమరుస్తుంది.

మారుతి ‘ట్రూ వాల్యూ’ ద్వారా తమ బ్రాండ్‌ కార్లనే అమ్మితే మహీంద్రా ‘ఫస్ట్‌ ఛాయిస్‌’ ద్వారా తమ కార్లనే కాక మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ లాంటి విదేశీ కార్లతో సహా అన్ని బ్రాండ్ల కార్లనీ కొని, అమ్ముతోంది. ఫోక్స్‌వ్యాగన్‌ వాళ్ల ‘దస్‌ వెల్ట్‌ ఆటో’ షోరూమ్‌లు కూడా అన్ని బ్రాండ్ల కార్లనీ కొని అమ్ముతాయి. టాటా మోటార్స్‌ అష్యూర్డ్‌, హ్యుందయ్‌ ప్రామిస్‌... ఇలా కార్ల కంపెనీలన్నీ పాత కార్ల కోసం ప్రత్యేక విభాగాలు పెట్టాయి. ఈ విభాగాలు తమ దగ్గరికి వచ్చిన ప్రతి కారుకి సంబంధించి 250 నుంచి 400 వరకూ రకరకాల అంశాలను క్షుణ్ణంగా పరీక్షించి లోపాలను సరిచేసి తిరిగి వాడకానికి సిద్ధం చేస్తాయి. యాంత్రిక లోపాలనే కాదు, రంగు వెలసి, గీరుకుపోయి, లేదా సొట్టలు పడిన కారు బాడీని కూడా సరిచేసి బాగా కన్పించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మేటప్పుడు ఏడాది వారంటీ ఇస్తారు. ఇలా కంపెనీల షోరూమ్‌లే కాకుండా స్టార్టప్‌లూ బోలెడు ఉన్నాయి. ఇవన్నీ ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లోనూ సేవలందిస్తున్నాయి.

పాత కార్లకి స్టార్టప్‌లా..?

అవును. పాత కార్లను కొని, పనికి వస్తాయని సర్టిఫికెట్‌ ఇచ్చి, అమ్మే... వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్లు ఇవి. ఇంకా వీటి ప్రత్యేకతలు ఏంటంటే- మనం పాత కారు అమ్మడానికి వెళ్తే దాని విలువని నిపుణుల చేత అంచనా వేయించి దాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. కొనుక్కునేవాళ్లకి ఎలాంటి సమస్యలూ లేకుండా కాగితాల బదిలీ, అవసరమైన యాక్సెసరీల ప్యాకేజీలు... లాంటివన్నీ ఇస్తారు. కొన్ని సంస్థలైతే వినియోగదారుల అవసరాలకు తగినట్లు కార్లను కస్టమైజ్‌ చేసి మరీ ఇస్తున్నాయి. ఉదాహరణకి కార్స్‌24 సర్వీసెస్‌ ప్రైవేట్‌ సంస్థ పెట్టి ఐదేళ్లయింది. కార్లను కొని అమ్మేందుకు వందల్లో డీలర్‌షిప్పులూ ఫ్రాంచైజీలూ ఉన్న ఈ కంపెనీకి కరోనా తర్వాత రూ.14వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘సెకండ్‌ హ్యాండ్‌ కార్లకి మా సంస్థ అమెజాన్‌లాంటిది’ అంటాడు సంస్థ సహ వ్యవస్థాపకుడు విక్రమ్‌ చోప్రా. ఆయన కొంతకాలం కోసం అమెరికా వెళ్తూ తన కారు అమ్మేయాలనుకున్నాడట. తక్కువ సమయంలో సరైన ధరకి అమ్మేందుకు తగిన వేదిక ఏదీ కన్పించకపోవడంతో స్నేహితుడికి ఇచ్చేసి వెళ్లాడట. అమెరికా నుంచి తిరిగి రాగానే ఆయన కార్స్‌24 సంస్థను ప్రారంభించాడు. పూర్తిగా ఆన్‌లైన్లో లావాదేవీలు నిర్వహించే ఈ సంస్థ ప్రతినిధులు అమ్మకానికి ఉన్న కారు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా వెళ్లి అన్ని కోణాల్లోనూ పరిశీలించి చూసి ధర నిర్ణయిస్తారు. ఫొటోలు తీసుకుని పూర్తి వివరాలతో తమ వెబ్‌సైట్లో పెడతారు. వినియోగదారులు వెబ్‌సైట్లో చూసి నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు.

ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. దేశీయ సంస్థలైన కార్‌దేఖో, స్పిన్నీ, ఆటోబాక్స్‌, డ్రూమ్‌ లాంటివే కాక విదేశీ ఓఎల్‌ఎక్స్‌లూ ఉన్నాయి. ఎవర్‌కార్స్‌ ఇండియా, డాక్టర్‌ కార్స్‌ లాంటి సంస్థలూ ఉన్నాయి. ‘బిగ్‌ బాయ్‌ టాయ్స్‌’ సంస్థ అయితే ఫెరారీ, లంబోర్గిని, పోర్షె, బుగాట్టి... లాంటి లగ్జరీ సెకండ్‌ హ్యాండ్‌ కార్లను అమ్ముతుంది.

ఆన్‌లైన్లో కార్ల అమ్మకాలా?

ప్రాంతాలవారీగా అందుబాటులో ఉన్న కార్ల వివరాలు ధర, ఫొటోలతో సహా ఆన్‌లైన్లో ఉంటాయి. అన్ని ఛార్జీలతో కలిపి నిర్ణయించిన ధరనే వెబ్‌సైట్లో పెడతారు. ఇంట్లో కూర్చునే వెబ్‌సైట్లో చూసి నిర్ణయించుకుని అన్నీ నచ్చితే ఆర్డరు చేయడమే. కారును ఇంటికి తెచ్చి ఇస్తారు సంస్థ ప్రతినిధులు. కొన్ని సంస్థలు అయితే తిరిగి అమ్మేటప్పుడు సుమారుగా ఎంత ధర వస్తుందో కూడా చెప్పేస్తాయి కాబట్టి కొనేవాళ్లు మరింత నమ్మకంగా కారు తీసుకెళ్లగలుగుతున్నారు. ఈఎంఐ సదుపాయం కూడా సంస్థలే కల్పిస్తాయి. ఈ సంస్థల్లో గతేడాది కన్నా ఈ సంవత్సరం కార్ల గురించి ఎంక్వైరీ చేసేవాళ్లు 400 శాతం పెరగగా కొంటున్నవారిలో స్త్రీల సంఖ్య పదిశాతం పెరిగిందట.

ఎంతైనా పాత కారేగా..?

అలా నిరుత్సాహపడేవారికి అమెరికాలో వ్యాపార నిపుణులు ఒక లెక్క చెబుతారు. అక్కడ సగటున ఒక్కో వ్యక్తీ తన జీవితకాలంలో 13 కార్లను మారుస్తాడట. అక్కడి ధర ప్రకారం వాటి సగటు తీస్తే ఒక్కోటీ సుమారు రూ. 22 లక్షలు అవుతుంది. అదే కొత్త కారు బదులు మూడేళ్ల పాత కార్లను కొనుక్కుంటూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితకాలంలో కార్ల ఖర్చులోనే దాదాపు కోటి రూపాయలు మిగులుతాయట. నిపుణులు చెప్పేదాని ప్రకారం చాలా సందర్భాల్లో మూడేళ్ల పాత కారు నాణ్యత విషయంలో దాదాపు కొత్త దాంతో సమానంగా ఉంటుంది. అంటే తక్కువ ధరకే కొత్త కారు కొన్నట్లన్నమాట. మనం పెట్టే డబ్బుకి పూర్తి విలువ లభిస్తుంది, తక్కువ డబ్బుకే కారు కొనుక్కోవాలన్న కోరిక తీరుతుంది కాబట్టే ఎక్కువ మంది సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఇష్టపడుతున్నారన్నది వారి అభిప్రాయం.

సమస్యలేవీ రావా?

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలూ లేకుండా కోరుకున్న కారుని ఇంటికి తెప్పించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. కారు కోసం ఎంత బడ్జెట్‌ కేటాయించగలరు, ఆ బడ్జెట్‌లో వచ్చే కారు మోడల్స్‌ ఏవేవి, అవి మన అవసరాన్ని తీరుస్తాయా... ఇవన్నీ కుటుంబసభ్యులతో ఇంటి దగ్గర చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఐదేళ్లలోపు పాత కార్లకి రుణాలు తేలిగ్గానే లభిస్తాయి కాబట్టి ఆ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ లెక్కలు వేసుకోవచ్చు. ఇంకా...బీ డీలర్‌ని ఎంచుకునేటప్పుడు వాళ్ల దగ్గర వేర్వేరు బ్రాండ్ల కార్లు ఉన్నాయా లేదా చూడాలి. అప్పుడే మన బడ్జెట్‌కీ, అభిరుచులకీ తగిన సరైన కారుని ఎంచుకోవచ్చు. ముందు మన ప్రాధాన్యాలను చెప్పి అందుకు తగిన కార్లనే చూపించమనాలి.
* రెండు మూడు చోట్ల పోల్చిచూసుకుంటే ఏది సరైన ధరో తెలిసిపోతుంది.
* ప్రమాదరహిత చరిత్ర ఉన్న కారుని ఎంచుకోవాలి. ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ చూపించమనాలి.
* సర్వీస్‌ హిస్టరీ చూస్తే కారు ఇంజిన్‌ ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుస్తుంది.
* కారుని మెకానికల్‌, టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేయించి రూపొందించే ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టు తీసుకోవాలి. కారుకు సంబంధించి దాదాపు నాలుగు వందల విషయాలను పరీక్షించాక దీన్ని తయారుచేస్తారు కాబట్టి ఆ రిపోర్టుతో కారు పరిస్థితి తెలిసిపోతుంది.

ప్రైవేటు వ్యక్తుల మధ్య అంటే..?

కారు అమ్మాలన్నా కొనాలన్నా పరిచయం ఉన్న వ్యక్తుల మీదో, స్నేహితులూ బంధువుల మీదో ఆధారపడడం. అలాంటి సందర్భాల్లోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారు చరిత్ర తెలుసుకోవడం, ఒరిజినల్‌ డాక్యుమెంట్లు పొందడం లాంటివి కష్టమవుతాయి. కేవలం నమ్మకం మీద ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొందరైతే దళారులుగానూ పనిచేస్తారు. వారి వల్ల డబ్బు నష్టం కలగవచ్చు. కారు కొనడం, అమ్మడం లాంటి వ్యవహారాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మైకార్‌హెల్ప్‌లైన్‌.కామ్‌ లాంటి వెబ్‌సైట్‌లనూ చూడవచ్చు.

పాత కార్ల కొనుగోలు అన్నది నగరాలకు మాత్రమే పరిమితమైన ట్రెండ్‌ కాదు, చిన్న చిన్న పట్టణాలూ గ్రామాల్లోనూ కార్ల అవసరం పెరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకుంటున్నాయి ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్లు. వేళ కాని వేళ ఏ ఆస్పత్రికో వెళ్లాల్సి వచ్చినా, కుటుంబమంతా కలిసి సరదాగా ఏ పిక్నిక్‌కో వెళ్లాలనుకున్నా... చేతిలో ఓ కారుంటే ఆ ధీమానే వేరు. అది కొత్తదైనా... పాతదైనా... కారు కారే కదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.