జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఎదుట రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది.
రిలయన్స్ ఇన్ఫ్రాటెల్.. తమ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ కొందరు వాటాదారులు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై, ఇతర అధికారులపైనా ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రిలయన్స్ ఇన్ఫ్రాటెల్.. రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్)కు అనుబంధ సంస్థ. ప్రస్తుతం దివాలాలో ఉంది.
ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ధిక్కరణకు సంబంధించిన అంశమేమీ కనిపించనందున కేసు నమోదు చేయలేమని స్పష్టం చేశారు ఎన్సీఎల్ఏటీ ఛైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ.
రూ. 230 కోట్ల బకాయిలు...
రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ తమకు సకాలంలో చెల్లించాల్సిన రూ. 230 కోట్లను కట్టలేదని అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది హెచ్ఎస్బీసీ డైసీ.
రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, హెచ్ఎస్బీసీ డైసీ ఇంకా ఇతర సంస్థలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అనిల్ అంబానీ అధీనంలోని సంస్థ ఆరు నెలల్లో ఈ మొత్తం చెల్లించాలని ఎన్సీఎల్ఏటీ 2018 జూన్ 26 నాటి ఆదేశాల్లో స్పష్టం చేసింది.
6 నెలల గడువు ముగిసిన అనంతరం.. రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో 4.26 శాతం వాటా కలిగిన 9 మంది మైనార్టీ వాటాదారులు, హెచ్ఎస్బీసీ డైసీ.. ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ప్రస్తుతం సంస్థ దివాలా ప్రక్రియలో ఉన్నందున చెల్లింపులు సాధ్యం కాదని, పైగా ఐబీసీ నిబంధనల కింద మారటోరియం విధింపు కొనసాగుతోందని ఆర్‌కామ్.. ట్రైబ్యునల్‌కు తెలిపింది.