మారుతీ సుజుకీ కాలుష్య రహిత వాహనాల తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగానే "వేగనార్" మోడల్లో... సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)తో నడిచే రెండు కార్లను ఈరోజు విడుదల చేసింది. వీటి ఎక్స్ షోరూం ధర రూ.4.84 లక్షలు, రూ.4.89 లక్షలుగా నిర్ణయించారు. లీటరు ఇంధనంతో 33.54 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం వీటి ప్రత్యేకత.
ఈ వేగనార్ సీఎన్జీ కార్లు పర్యావరణ హితమైనవి. గ్యాస్ సాయంతో నడిచే ఈ వాహనాల్లో భద్రత విషయంలో రాజీ లేదు. సాంకేతికత సాయంతో అన్ని ఏర్పాట్లు చేశాం
--ఆర్.ఎస్.కల్సి, మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
దిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్, ముంబయి, పూణె, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కార్లు అందుబాటులో ఉండనున్నాయి.
మంచి పికప్, భద్రతతో కూడిన డ్రైవింగ్ సదుపాయం, డ్యూయల్ ఈసీయూ(ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్), ఇంటెలిజెంట్ గ్యాస్ పోర్ట్ ఇంజెక్షన్ సాంకేతికత కలిగి ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రస్తుత మోడళ్లలో ఏడు కార్లకు(ఆల్టో800, ఆల్టో కె10, వేగనార్, సిలిరియో, ఈకో, సూపర్ క్యారీ, టూర్ ఎస్) సీఎన్జీ సదుపాయం కల్పించింది మారుతీ సుజుకీ. పర్యావరణాన్ని కలుషితం చేసే ఉద్గారాల నియంత్రణకు మరింత కృషి చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.