రాష్ట్రంలో జులై నెలలో మద్యం అమ్మకాలు తగ్గినా డిపోల్లో నుంచి సరకు మాత్రం విరివిగా పంపిణీ జరిగింది. ఒక్క నెలలోనే ఏకంగా సుమారు రూ.2,507 కోట్ల మద్యం... దుకాణాలకు సరఫరా అయింది. గత ఏడాది జులైతో పోల్చితే ఇది సుమారు రూ.600 కోట్లు అధికం. అయితే విక్రయాలపరంగా చూస్తే బీర్ కేస్‌ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది మద్యం ధరలు పెరగడంతోపాటు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సరకు తరలిపోతుండటం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
- గత ఏడాది జులైలో 31.48లక్షల కేస్‌ల లిక్కర్ అమ్ముడుపోగా.. 41.7లక్షల కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి.సుమారు రూ.1900కోట్ల ఆదాయం సమకూరింది.
- ఈసారి 31.34 లక్షల కేస్‌ల లిక్కర్ డిపోల నుంచి దుకాణాలకు దిగుమతి అయింది. అలాగే 22.99 లక్షల కేస్‌ల బీర్లు సరఫరా అయ్యాయి. దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం లభించడం గమనార్హం.
సరిహద్దు జిల్లాలకు విరివిగా సరఫరా
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం ధరలు పెరిగినా.. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి మద్యం దొంగచాటుగా ఆంధ్రకు తరలిపోతోంది. తెలంగాణలో సరిహద్దు జిల్లాల్లోకే డిపోల నుంచి మద్యం సరఫరా అధికంగా ఉండటాన్నిబట్టి ఇది బహిరంగ రహస్యంగా మారింది. గత జూన్ కంటే జులైలోనే ఎక్కువ మద్యం అమ్ముడుపోవడంతో అక్రమ రవాణా పెరిగిందని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్