మార్కెట్లో ఇటీవల కనిపించిన దిద్దుబాట్లు, ద్రవ్యోల్బణం వంటి విషయాలపై పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంటున్నారు. భారత్‌లో బుల్ మార్కెట్ కొనసాగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. 'కేవలం చిన్న చిన్న దిద్దుబాట్లకు మదుపర్లు భయపడాల్సిన అవసరం లేద'ని ఒక ఆంగ్ల ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. గత వారం 15900 స్థాయికి చేరిన నిఫ్టీ, సోమవారం 15500-15765 మధ్య ఊగిసలాడి 15746.50 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. '2004-08 నాటి బుల్ మార్కెట్‌కు ముందు అంటే 2002-03లో కలిగిన అనుభూతే ఇపుడే కలుగుతోంది. ఈ సారి బుల్ మార్కెట్ ఆరేళ్లు కాదు.. దశాబ్దాల కొద్దీ కొనసాగుతుంద'నే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే బుల్‌మార్కెట్లోనూ దిద్దుబాట్లు ఉంటాయని వివరించారు. కరోనా మూడో దశ తీవ్ర ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని పేర్కొన్నారు. 'కొవిడ్ రెండో దశ ఉద్ధృతిని ఎవరూ అంచనా వేయలేదు. ఇపుడు మూడో దశ గురించి మాట్లాడుతున్నారు. టీకా కార్యక్రమం వేగాన్ని అందుకుంది. రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడో దశ తీవ్ర ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. ఆర్థిక వ్యవస్థ సైతం ఇపుడు గతంలో కంటే మెరుగ్గా సిద్ధమైంద'ని ఝున్‌ఝున్‌వాలా అన్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాన్ని చూపించగలవని.. అందుకే భారత ఆర్థిక వ్యవస్థపై 'బులిష్'గా ఉన్నట్లు తెలిపారు.
మరో ఏడాది బుల్ మార్కెట్టే!
స్టాక్‌మార్కెట్‌లో మరో ఏడాది కాలం పాటు బుల్స్ హవా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక, పరిశోధనా సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. గత ఏడాది మార్చిలో నమోదైన కనిష్ఠ స్థాయి నుంచి బుల్ మార్కెట్ మొదలైంది, ఇది ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుందని తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు షేర్ల విలువను లెక్కించే సమయంలో పీఈ నిష్పత్తి కంటే ప్రైస్-టు-బుక్ వాల్యూను (పీబీవీ) పరిగణనలోకి తీసుకోవడం మేలని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. బుల్‌మార్కెట్‌లో గరిష్ఠంగా సగటు పీబీవీ 5.2 వరకు నమోదైనట్లు, ప్రస్తుతం ఇది 3.6 మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. గతంలో 4 సందర్భాల్లో సగటున బుల్ మార్కెట్ 72 వారాలు ఉన్నట్లు, ప్రస్తుత బుల్‌మార్కెట్ 64 వారాలు పూర్తిచేసుకున్నట్లు విశ్లేషించింది. 2003-08 మధ్య కాలంలో వచ్చిన బుల్ మార్కెట్ ధోరణి ఇప్పుడు కూడా కనిపిస్తోందని, అప్పట్లో 246 వారాలు కొనసాగిందని, ఇప్పుడూ మరో ఏడాది పాటు దేశీయ స్టాక్‌మార్కెట్లో బుల్లిష్ ధోరణి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. సమీప భవిష్యత్తులో వినియోగ వస్తువులు, ఉత్పత్తి రంగ పరిశ్రమలు, ఆర్థిక సేవల రంగాల కంపెనీలు మెరుగైన ఆదాయాలు నమోదు చేస్తాయని భావిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ వివరించింది.
రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిస్తుండటం వల్లే: ఫిక్కీ
రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తుండటంతో.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయని ఫిక్కీ- ధ్రువ అడ్వయిజర్స్ సర్వే వెల్లడించింది. రాబోయే 6 నుంచి 12 నెలల్లో మెరుగైన పనితీరును కనబరుస్తామనే ఆశాభావం కంపెనీల్లో నెలకొందని తెలిపింది. సుమారు 211 కంపెనీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఆయా సంస్థలు తెలిపాయి. 'కొవిడ్-19 రెండో దశ భయాలతో వినియోగదారు విశ్వాసం దెబ్బతినడంతో కంపెనీల అమ్మకాలు తగ్గాయ'ని సర్వే పేర్కొంది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ క్షీణత కనిపించింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగవుతున్నా, కొవిడ్-19 మలివిడతలకు కూడా సిద్ధంగా ఉండాలని పేర్కొంది.
ఆ 5 చర్యలు చేపట్టాలి..
కొవిడ్-19 మలివిడతలను ఎదుర్కొనేందుకు 5 చర్యలను ఫిక్కీ సూచించింది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన మౌలిక వసతులకు కేటాయింపులు పెంచడం, అత్యవసర ఔషధాల నిల్వలు తగినంతగా ఉండేలా చూసుకోవడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొత్త మౌలిక వసతులను కొనసాగించడం, రోగ నిర్థారణ కేంద్రాలను పెంచడం, ప్రభుత్వ నిధులతో టీకాల తయారీ నిమిత్తం ఓ జాతీయ కేంద్రాన్ని నెలకొల్పాలని సూచించింది. విమానాశ్రయాలు, రైల్వే - బస్సు స్టేషన్లు, పాఠశాలలు, గ్రామాల పంచాయతీ కార్యాలయాల వద్ద టీకాలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫిక్కీ సూచించింది. జనావాసాలు దగ్గరదగ్గరగా ఉండే మురికివాడల్లో టీకాల కోసం మొబైల్ వ్యాన్లను సిద్ధం చేయాలని, బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే టీకాలు వేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఇదీ చూడండి: ఈ-కామర్స్ సంస్థలకు షాక్- ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం!