దేశీయ మార్కెట్లో పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ధన త్రయోదశితో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతున్న వేళ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర మళ్లీ 39 వేల మార్క్‌ను దాటింది.
బులియన్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల పుత్తడి ధర రూ. 220 పెరిగి రూ. 39,240 పలికింది. వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. ఇవాళ ఒక్కరోజే రూ.670 పెరిగి కిలో వెండి ధర రూ. 47,680కి చేరింది.
పెళ్లిళ్ల సీజన్
ధన త్రయోదశినాడు బంగారం, వెండి ఆభరణాలు కొంటే మంచిదని చాలా మంది నమ్మకం. అయితే ఈ సారి మాత్రం బంగారం, వెండి అమ్మకాలు దాదాపు 40 శాతం తగ్గాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి.
షేర్ మార్కెట్లలో కళ తప్పిన పసిడి
ధన త్రయోదశి వేళ కొనుగోళ్లు పెరిగినా స్టాక్ మార్కెట్లలో మాత్రం పసిడి షేర్లు 6.6 శాతం పడిపోయాయి. త్రిభువన్దాస్ భీమ్జీ ఝవేరి, తంగమాయిళ్, పీసీ జువెల్లర్స్, టైటాన్ షేర్లు పతనమయ్యాయి. పసిడి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారంలో పెట్టుబడే శ్రేయస్కరం
అంతర్జాతీయ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ లోహాల ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.