కరోనా విజృంభణ నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజీలను మార్చి 31వరకు మూసివేయాలని సెబీని కమోడిటీ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీపీఏఐ) కోరింది. ఎక్స్ఛేంజి సేవలను రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరమైనవిగా గుర్తించకపోతే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
భారత జాతీయ ఎక్స్ఛేంజీ సభ్యుల సంఘం(ఏఎన్ఎంఐ) కూడా స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలను కనీసం 2 రోజులు నిలిపేయాలని సెబీని కోరింది. ఫలితంగా బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత పరిస్థితులను అధిగమించే అవకాశం లభిస్తుందని తెలిపింది.
లాక్డౌన్ నిబంధనల పరిధి నుంచి సెబీ నియంత్రిత స్టాక్ మార్కెట్ల సేవలు, ఉద్యోగులను మినహాయించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్రం సూచించింది. అయితే బ్రోకర్లు, డిపాజిటర్లకు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలులేకపోవటం వల్లనే సీపీఏఐ, ఏఎన్ఎంఐ తాజా డిమాండ్ చేస్తున్నాయి.
"కరోనాతో మానవాళికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ, 144 సెక్షన్, లాక్డౌన్ అమల్లో ఉన్నాయి. ఫలితంగా ప్రయాణం చాలా క్లిష్టంగా మారిపోయింది. మరికొద్ది రోజులు పోతే వారి కార్యాలయానికి చేరుకోవటం అసాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని ఎక్స్ఛేంజీలను మార్చి 31 వరకు మూసివేయాలి."
- నరిందర్ వధ్వా, సీపీఏఐ అధ్యక్షుడు
ఇప్పటివరకు స్టాక్ బ్రోకింగ్ సేవలను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రమే గుర్తించాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదు.