కొన్ని రోజులుగా కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రోజురోజుకు పతనాల్లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. కరోనా సహా ఆర్థిక మందగమనం భయాలతో గత నెల నుంచే మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఫిబ్రవరి 28 నుంచి రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే మాట ఇప్పుడు మారింది. చైనాకు వైరస్ సోకితే.. ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. కరోనా ప్రభావంతో ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ ఏకంగా 7,850 పాయింట్లు కోల్పోయింది. ఇలాంటప్పుడు చిన్న మదుపరులు ఏం చేయాలన్నది ప్రధానంగా తెలుసుకోవాలి..
లక్ష్యం వదిలేయొద్దు..
పెట్టుబడిని ప్రారంభించేప్పుడే దానికో లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇక మన దృష్టంతా దానిపైనే ఉండాలి. ఉదాహరణకు రాబోయే 20 ఏళ్ల వరకూ నెలకు రూ.5,000 మదుపు చేయాలి.. కనీసం 12 శాతం వార్షిక రాబడి రావాలి.. అనే లక్ష్యంతో మార్కెట్లోకి ప్రవేశించారు. ఈ 20 ఏళ్ల కాలంలో సూచీలకు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. వాటన్నింటి గురించీ మనకు అవసరం లేదు. మార్కెట్ ప్రతి దశలోనూ మన పెట్టుబడులు ఉన్నాయా లేదా అనేదే ప్రధానం.
ఎంతోకొంత నష్టభయం లేకుండా పెట్టుబడులు ఉండవు. ఇక్కడ మరో ముఖ్య విషయం.. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎక్కువ వ్యవధి లేదనుకోండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులను కొనసాగించడం ఇబ్బందికరమే. మరింత నష్టాలు రాకముందే ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులను కాస్త సురక్షిత పథకాల్లోకి మళ్లించడం మేలు.
మీరు ఇప్పుడిప్పుడే మదుపు ప్రారంభించారనుకుందాం. మార్కెట్ తగ్గుతోంది అంటే కొత్త అవకాశం ఇచ్చినట్లే. వీలైతే క్రమానుగత పెట్టుబడి మొత్తాన్ని పెంచేందుకూ ప్రయత్నించవచ్చు. ఇంకా అనుమానాలున్నాయనుకోండి.. కొత్త పెట్టుబడులకు కాస్త విరామం ఇవ్వండి. మార్కెట్‌పై మరింత స్పష్టత వచ్చాకే మదుపు తిరిగి ప్రారంభించండి. ఆందోళన, అత్యాశ రెండూ మన శత్రువులే. వీటిని కట్టడి చేయాలి. పూర్తి వివరాలు తెలుసుకుని, స్పష్టమైన అవగాహనతో మదుపు కొనసాగించాలి.
నష్టం.. సహజం..
షేర్లు, వీటి ఆధారంగా పనిచేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు.. వీటిలో ఎంతో కొంత నష్టభయం సహజమే. ఆ మాటకొస్తే.. ప్రతి పెట్టుబడి పథకంలోనూ ఎంతోకొంత నష్టభయం అంతర్లీనంగా ఉంటుంది. మార్కెట్‌లో ఎప్పుడూ ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చే ప్రతిదశలోనూ కొత్త పెట్టుబడులకు అవకాశాలుంటాయి. ప్రతిసారీ లాభాలే రావు.. ఎప్పుడూ నష్టపోం.
మార్కెట్, పెట్టుబడులపైన ఆసక్తి ఉన్న మదుపరులు పరిస్థితులతో సంబంధం లేకుండా సరికొత్త అవకాశాలను అందుకుంటూనే ఉంటారు. ఏ విధంగా ఉన్నా కొంతమంది లాభాలు సంపాదిస్తుంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మీరు ఎంత వరకూ నష్టభయం భరించగలరనే విషయాన్ని లెక్కించండి. నష్టం వచ్చినా తట్టుకోగలం అనుకుంటే.. చైనాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పరిస్థితులు సర్దుకున్నాక అవి అధిక రాబడులను అందించే అవకాశం లేకపోలేదు.
చాలా సందర్భాల్లో మదుపరులు నష్టభయాన్ని అంచనా వేసుకోరు. ఫలితంగా సంక్షోభాలు వచ్చినప్పుడు తమ పెట్టుబడులన్నింటినీ ఒకేసారి వదిలించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సరైన విధానం కాదు. ఒకసారి మీ పెట్టుబడుల జాబితాను పరిశీలించండి. అందులో ఉన్నవి ఏ మార్కెట్ దశలనైనా తట్టుకొని నిలబడగలవా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ అందులో సరైన షేర్లు, ఫండ్లు, ఇతర పథకాలు లేకపోతే వాటిని వదిలించుకోండి. నాణ్యమైనవి జాబితాలో జత చేసేందుకు ప్రయత్నించండి.
ప్రస్తుతం స్థిరమైన రాబడినిచ్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లార్జ్‌క్యాప్, బ్లూచిప్ షేర్లలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవాలి. హెచ్చుతగ్గులు అధికంగా ఉండే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకోవడమే మేలు.
నిధులు సిద్ధంగా..
మార్కెట్లో దిద్దుబాటు వచ్చినప్పుడు.. పెట్టుబడి అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకోసం మన దగ్గర నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదే సమయంలో అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బును అందుబాటులో పెట్టుకోవడం తప్పనిసరి. బ్యాంకు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇంట్లో కొంత నగదు ఇప్పుడు ఉండాల్సిందే. ఆదాయం ఆగిపోయినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా నగదు ఆదుకుంటుంది. కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్మును అందుబాటులో ఉంచుకోండి.
పెంచుకోండి ఆరోగ్య ధీమా..
ఒక విధంగా మనం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు ఎలాంటి వైరస్‌లు, వ్యాధులు వస్తున్నాయో అంతుబట్టడం లేదు. ఏ ఆరోగ్య ఇబ్బంది వచ్చినా.. లక్షల రూపాయల్లోనే ఖర్చవుతోంది. దీన్ని తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా తప్పనిసరి. ఉద్యోగ సంస్థ ఇస్తున్న పాలసీతోనే సరిపెట్టుకుంటామన్నా ఇబ్బందే. ప్రతి కుటుంబానికీ కనీసం రూ.10లక్షల వరకైనా ఆరోగ్య ధీమా ఉండాల్సిందే. తక్కువ ప్రీమియంతో లభించే సూపర్ టాపప్ పాలసీలను ఎంచుకోండి. అందుబాటులో కొంత నగదూ ఉండాల్సిందే.
వైవిధ్యమే ప్రాణం..
పెట్టుబడులకు వైవిధ్యమే ప్రాణం. ఒకేచోట మొత్తం పెట్టుబడులు ఉండటం ఎప్పడూ సరికాదు. దీనివల్ల తక్కువ రాబడి రావడంతోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకోవడమూ కష్టమే. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో బంగారానికి ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. దీనితో పోలిస్తే.. స్టాక్ మార్కెట్, స్థిరాస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ మార్కెట్‌లేవీ మంచి రాబడిని ఇవ్వలేదు.
వయసు, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, లక్ష్యాలకు అనుగుణంగా వైవిధ్యమైన పెట్టుబడులను ఎంచుకోవాలి. ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు. మార్కెట్ కుదుటపడితే.. బంగారం ఇచ్చే రాబడి తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఈక్విటీల్లో లాభాలు కనిపిస్తాయి. అందువల్ల అవకాశం ఉన్న అన్ని పథకాల్లోనూ క్రమానుగత పెట్టుబడులు కొనసాగించాలి.
(రచయిత- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్)