చైనా ఉత్పత్తులను బహిష్కరించాని ఇటీవల పెద్దఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. లాక్డౌన్ కారణంగా దేశీయ ఉత్పత్తి తగ్గటం, సరఫరాలో సమస్యలు ఏర్పడినప్పటికీ.. గత జూన్ త్రైమాసికంలో అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో నాలుగింట మూడు చైనావేనని తాజాగా ఓ నివేదిక తేల్చటం గమనార్హం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా సంస్థలే తొలిస్థానంలో ఉంటున్నాయి.
మరోవైపు.. చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్‌తో.. డ్రాగన్ స్మార్ట్ఫోన్ల బ్రాండ్లు ఎదుర్కొంటున్న సవాళ్లతో తక్షణ లబ్ధిపొందింది సామ్సంగ్. ఈ విషయాన్ని 'సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ రివ్యూ' నివేదిక తేల్చింది. తనకు ఉన్న సరఫరా గొలుసుతో క్షీణిస్తున్న మార్కెట్ వాటాకు అడ్డుకట్ట వేసి.. క్యూ2లో 24 శాతానికి మెరుగుపరిచినట్లు పేర్కొంది.
"రాబోయే త్రైమాసికాల్లో సామ్సంగ్ ఇలాగే తన పనితీరును కొనసాగించగలిగితే.. వినియోగదారుల డిమాండ్‌ను అందుకోగలదు. ఇతర సంస్థలతో పోటీ పడగలదు. చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు. సామ్సంగ్ డిమాండ్‌లో పెరుగుదల ఉంటుందో లేదో మూడో త్రైమాసికం ఒక పరీక్షగా నిలవనుంది."
- అమిత్ శర్మ, సీఎంఆర్ ఇంటలీజెన్స్ గ్రూప్ మేనేజర్.
73 శాతానికి..
రెండో త్రైమాసికంలో భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మార్కెట్ వాటా 73 శాతానికి పడిపోయింది.
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా జూన్ త్రైమాసికంలో దేశంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్ 41 శాతం (క్వార్టర్-ఆన్-క్వార్టర్), 48 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) మేర క్షీణించింది.
టాప్‌లో షియోమీ
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటాలో క్యూ2లో షియోమీ (30 శాతం)తో తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత సామ్సంగ్ (24శాతం), వీవో (17 శాతం)తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు నోకియా వాటా క్షీణించింది. ఐఫోన్ ఎస్-2020కి డిమాండ్ పెరగటంతో యాపిల్ 8వ స్థానంలో నిలిచింది. షియోమీకి చెందిన రెడ్మీ 8ఏ, 8, నోట్ 8లు సంస్థ మార్కెట్ వాటాలో 60 శాతం మేర ఉన్నాయి.
ఇదీ చూడండి: చైనా స్మార్ట్ఫోన్ల సేల్స్‌పై 'స్వదేశీ' దెబ్బ