రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మధ్య ఒప్పందం విషయంలో 'నారదుడి'లా వ్యవహరిస్తున్నారంటూ.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు అఖిల భారత ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సంఘం లేఖ రాసింది. అమెజాన్ సృష్టిస్తున్న అడ్డంకుల వల్ల సంఘంలోని సభ్యులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అందులో పేర్కొంది.
ఈ ఒప్పందం పూర్తవ్వని కారణంగా దాదాపు 6,000 మంది సభ్యులకు ఫ్యూచర్ గ్రూప్ అధిపతి కిశోర్ బియానీ నుంచి రావాల్సిన రూ.6,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయని వివరించింది సంఘం. 2020 మార్చి నుంచి ఈ మొత్తం బకాయి ఉన్నట్లు తెలిపింది. ఆగస్టులో రిలయన్స్‌తో కుదిరిన ఒప్పందంతో తమ ఆశలు చిగురించాయని, అయితే వాటికి అమెజాన్ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు పేర్కొంది.
'అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండం వల్ల పంపిణీదారులకు చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది' అని వివరించింది అఖిల భారత ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సంఘం. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని అనవసర రాద్దాంతం అపాలని అమెజాన్‌ను కోరింది. అంతగా కావాలంటే కిశోర్ బియానీపై దిల్లీ, సింగపూర్, సియాటెల్.. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కేసు వేసుకోమని బెజోస్‌కు సూచించింది.
ఈ కేసులో అమెజాన్ తీరుకు వ్యతిరేకంగా బెంగళూరులోని ఇండియా పోస్ట్ నుంచి 'గెట్ వెల్ సూన్' గ్రీటింగ్ కార్డ్‌లను పంపించాలని కూడా సంఘంలోని సభ్యులు నిర్ణయించారు.
ఇదీ చదవండి:'ఉద్యోగుల టీకా ఖర్చులు మేమే భరిస్తాం'