అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆద్యంతం అద్భుతంగా సాగినా.. ఓ లోటు మాత్రం కొట్టవచ్చినట్లు కనిపించింది. అదే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కొలిక్కిరాకపోవడం. కనీసం కొన్ని వాణిజ్యాంశాలపైనా ఇరుదేశాలు ఓ అవగాహనకు రాలేకపోయాయి. రాబోయే రోజుల్లో భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించడం ద్వారా ట్రంప్ ఈ లోటు తీవ్రతను కాస్త చల్లార్చే ప్రయత్నం చేశారు. దాదాపు 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాల్ని ఖరారుచేసుకోవడం, మూడు ఎంఓయూలపై సంతకాలు చేయడం ఒక్కటే చెప్పుకోదగిన పరిణామం. వాణిజ్య విభేదాల పరిష్కారానికి రెండు దేశాలూ శ్రమిస్తున్నప్పటికీ.. ఒప్పందం ఎందుకు ఖరారు కాలేదు? ఇరువురి మధ్య అంతటి తీవ్ర విభేదాలు ఎందుకున్నాయి? అనేవి ఆసక్తికర అంశాలు.
వాణిజ్య లోటుపై రాజీలేదు
ప్రస్తుతం రెండు దేశాల మధ్య దాదాపు 1700 కోట్ల డాలర్ల వాణిజ్యలోటు కొనసాగుతోంది. వాణిజ్య ఒప్పందానికి ఇదో ప్రధాన అడ్డంకిగా మారింది. ద్రవరూప సహజవాయువు, యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా ఈ లోటును పూడుస్తామని భారత్ ప్రతిపాదిస్తుంటే.. ఇతరత్రా ఉత్పత్తుల కొనుగోలు ద్వారా పూడ్చాలని అమెరికా కోరుతోంది.
సుంకాలపై రగడ
సుంకాల విషయంలో ఇద్దరికీ పొసగట్లేదు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇది మరీ ఎక్కవ. మేధోపరమైన హక్కులు, పాడి ఉత్పత్తులు, కోడి కాళ్లు(చికెన్ లెగ్స్), హార్లీడేవిడ్‌సన్ బైకుల కొనుగోలు విషయంలోనూ విభేదాలున్నాయి. భారత్ సహా దాదాపు డజను దేశాల నుంచి దిగుమతి చేసుకునే అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై 2018లో అమెరికా భారీగా సుంకాలు వడ్డించింది. పేద దేశాలకు ఉద్దేశించిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ) నుంచి భారత్‌ను గత ఏడాది అమెరికా తప్పించింది. దీనికి నిరసనగా 28 అమెరికా ఉత్పత్తులపై మన దేశమూ భారీ సుంకాలు విధించింది. ఇక తమ ఉత్పత్తుల్ని భారత్‌లో విక్రయించడం కష్టంగా ఉందని అమెరికా పాడి రైతులు ఆరోపిస్తున్నారు. అయితే శాకాహారాన్ని భుజించే ఆవుల ఉత్పత్తుల్నే తాము కొనుగోలుచేస్తామని, అమెరికాలోని ఆవులకు మాంసాహార మిశ్రమ దాణాను పెడుతున్నారని భారతదేశం అభ్యంతర పెడుతోంది.
ఎఫ్‌డీఐల విభేదాలు
భారత బ్యాంకింగ్, బీమా రంగాల్లో దశాబ్దాలుగా పరిమితంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్నాయి. ఎఫ్‌డీఐ నిబంధనల్ని కొన్నేళ్లుగా భారత్ గణనీయంగా సరళీకరించినా.. బీమా రంగంలో ఇప్పటికీ 49 శాతం, బ్యాంకింగ్ రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకే అనుమతిస్తున్నారు. మీడియా రంగంలోనూ ఇలాంటి పరిమితులు కొనసాగుతున్నాయి. సింగిల్‌బ్రాండ్ రీటైట్‌పై 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించినప్పటికీ.. దానిని స్థానికతతో ముడిపెట్టారు. మల్టీబ్రాండ్ రీటైల్‌లోకి 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించినా.. ఎఫ్‌డీఐ స్వభావాన్ని బట్టి భారత్ అవసరమైతే బయటికి రావొచ్చు. ఈ వాతావరణం అమెరికాకు నచ్చట్లేదు.
వీసాల తగాదా
ట్రంప్ సర్కారు అమలుచేస్తున్న కఠినతర వీసా నిబంధనలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. అత్యంత నిపుణులైన విదేశీయులకే హెచ్1బీ, ఎల్1 వీసాలు ఇస్తామంటూ అమెరికా తెచ్చిన నిబంధన వల్ల తమ దేశస్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తపరుస్తోంది. వీసాల సంఖ్య కుదింపునూ వ్యతిరేకిస్తోంది. అయితే దీనిని వలస విధానం కింద చూడాలే తప్ప వాణిజ్యంతో ముడిపెట్టకూడదని అమెరికా అంటోంది.
రాజకీయ అనివార్యతలు
అటు ట్రంప్, ఇటు మోదీలకు స్వదేశాల్లో ఉన్న రాజకీయ అనివార్యతలు ఒప్పందానికి మరో అడ్డంకిగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒప్పందం పేరుతో భారతదేశానికి ఏమాత్రం రాయితీలు ఇచ్చినా.. ఈ ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నష్టపోతానని ట్రంప్ భావిస్తుండడం దీనికో కారణం. అందుకే ఎన్నికల తర్వాత తాను మళ్లీ గెలిస్తే భారత్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంటానని ఆయన చెబుతున్నారు. అమెరికాకు అవాంఛనీయ వాణిజ్య ప్రయోజనాలు కల్పించొద్దంటూ మోదీపై దేశీయంగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మార్కెట్లపై వారెన్ బఫెట్ ఏమన్నారంటే?