టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 2019 డిసెంబర్లో 8 నెలల గరిష్ఠం వద్ద 2.59 శాతానికి పెరిగింది. ఉల్లి, బంగాళ దుంపల ధరలు పెరగటం కారణంగా 2019 నవంబర్లో 0.58 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరిగినట్లు తెలిసింది.
2018 డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 3.24 శాతంగా ఉంది.
రిటైల్ ద్రవ్యోల్బణంలో గణనీయ పెరుగుదల, ఆహార పదార్థాల ధరలు మిన్నంటడం కారణంగా టోకు ధరలు భారీగా పెరిగాయి.
నవంబరులో 11 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ధరల పెరుగుదల రేటు 13.12 శాతానికి చేరింది. ఆహారేతర పదార్థాల ధరల పెరుగుదల రేటు దాదాపు నాలుగింతలు పెరిగి 7.72 శాతం పెరిగింది. ఇక కూరగాయల ధరలు 69.69 శాతం పెరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉల్లి 455.83 శాతం, బంగాళాదుంప 44.97 శాతం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.
ఇక సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరిన విషయం విదితమే.
ఇదీ చూడండి:లాభం తగ్గినా.. రూ.1 మధ్యంతర డివిడెంట్ ప్రకటించిన విప్రో