భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) అదేశాల మేరకు బీమా సంస్థలు ప్రామాణిక పాలసీలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనా కవచ్, కరోనా రక్షక్, ఆరోగ్య సంజీవని పాలసీలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 1 నుంచి ప్రామాణిక టర్మ్ పాలసీ 'సరళ్ జీవన్ బీమా'నూ కంపెనీలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పాలసీల్లో నిబంధనలను అందరూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉందనే ఉద్దేశంతో ఐఆర్‌డీఏఐ.. సరళ్ జీవన్ బీమాను ప్రవేశ పెట్టింది.
ఏమిటీ సరళ్ జీవన్ బీమా?
సరళ్ జీవన్ బీమా అనేది వ్యక్తిగత రిస్క్ ప్రీమియం జీవిత బీమా. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదంతో మరణిస్తే.. నామినీకి హామీ ఇచ్చిన నగదు మొత్తాన్ని ఏక కాలంలో చెల్లిస్తాయి బీమా కంపెనీలు.
ఆరోగ్య సంజీవనిలానే ఈ పాలసీని అన్ని కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీమియంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి కంపెనీలను బట్టి మారతాయి.
ఎవరు తీసుకోవచ్చు?
18 నుంచి 65 ఏళ్లలోపు ఎవరైనా ఈ బీమా తీసుకోవచ్చు. లింగ భేదం, నివాస స్థలం, వృత్తి, విద్యార్హతలు వంటి వాటితో సంబంధం లేదు. బీమా కవర్ కనీసం రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూర.25 లక్షలుగా ఉంటుంది.
బీమా సంస్థలు రూ.25 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి హామీ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది ఐఆర్‌డీఏఐ. ఇతర నిబంధనలను మాత్రం అలానే ఉంచింది.
పాలసీ కాల వ్యవధి కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు ఉంటుంది. వారికి మూడు రకాల ప్రీమియం చెల్లింపు సదుపాయాలు ఉంటాయి. అవి.. సాధారణ ప్రీమియం, 5, 10 ఏళ్లకు పరిమిత టర్మ్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం.
సాధారణ, పరిమిత ప్రీమియంలో పాలసీదారుకు మరణానంతరం వచ్చే.. డెత్ బెనిఫిట్ వార్షిక ప్రీమియం మొత్తం కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. లేదా పాలసీదారు మరణించే సమయానికి చెల్లించిన మొత్తం ప్రీమియం కన్నా 105 శాతం ఎక్కవగా డెత్ బెనిఫిట్ కింద చెల్లిస్తాయి బీమా సంస్థలు.
సింగిల్ ప్రీమియం పాలసీలకు డెత్ బెనిఫిట్ అధికంగా ఉంటుంది. ప్రీమియం మొత్తం కన్నా 125 శాతం అధిక మొత్తంలోగాని.. ముందే హామీ ఇచ్చిన మొత్తాన్ని గాని డెత్ బెనిఫిట్ కింద చెల్లిస్తాయి బీమా సంస్థలు.
పాలసీదారు.. పాలసీ టర్మ్‌లో జీవించి ఉంటే ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్‌ను బీమా సంస్థలు చెల్లించవు.
వెయింటింగ్ పీరియడ్..
ఈ పాలసీల్లో వెయిటింగ్ పీరియడ్ 45 రోజులు ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్‌లో ఏదైనా ప్రమాదం వల్ల పాలసీదారు మరణిస్తే బీమా వర్తిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర కారణాలతో పాలసీదారు మరణిస్తే.. పన్నులు మినహాయించి పాలసీదారు చెల్లించిన 100 శాతం ప్రీమియాన్ని తిరిగి ఇచ్చేస్తాయి బీమా కంపెనీలు.
మినహాయింపులు..
సరళ్ జీవన్ బీమాలో ఆత్మహత్యలకు తప్ప ఇతర ఏ మినహాయింపులు లేవు.
ఇదీ చూడండి:2021లో ఈ ఆర్థిక సూత్రాలు పాటిద్దాం!