కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు కేటాయింపుల వైపు ఆశగా ఎదరుచూస్తున్నారు. కరోనా వల్ల వివిధ రంగాల దెబ్బతిన్న వేళ తమ రంగానికి కేటాయింపులు జరపాలని, రాయితీలు ప్రకటించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఇంతకీ ఈ బడ్జెట్ నుంచి పరిశ్రమ వర్గాలు ఏం ఆశిస్తున్నాయ్.. వాటి ఆకాంక్షలేంటో ఇప్పుడు చూద్దాం..
రియల్ ఎస్టేట్
ఈ సారి బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఉపాధి కల్పనకు కేంద్రమైన ఈ రంగానికి కొన్ని రాయితీలు ప్రకటించాలని రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సంస్థ క్రెడాయ్ కోరుతోంది. ముఖ్యంగా గృహ రుణ చెల్లింపుల విషయంలో కొనుగోలుదారులకు సెక్షన్ 80సి కింద ఉన్న పరిమితిని పెంచాలని కోరుతోంది. అలాగే, నిర్మాణ వ్యయం పెరగకుండా చర్యలు ఉండాలంటోంది.
- ఇదీ చూడండి:ఇలా చేస్తేనే 'రియల్' జోష్!
హెల్త్, ఫార్మా
కరోనా వేళ ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పటికే ఫార్మా రంగంలో రారాజుగా పేరొందిన మన దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) పరంగా మరింత ముందుకెళ్లాల్సి ఉందని ఆ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం ఆర్ అండ్ డీపై చేసే ఖర్చుకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నాయి.
జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వాటా పెంచాలని సూచిస్తున్నారు బయోకాన్ లిమిటెడ్ చీఫ్ కిరణ్ మజుందర్ షా.
- ఇది చూడండి:'ఆరోగ్య' భారతానికి ఊతమిస్తారా?
ఆటోమొబైల్
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాహన రంగం కూడా బడ్జెట్‌పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. వాహనాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది. 15 ఏళ్లు దాటిన పాత వాణిజ్య వాహనాల కోసం తుక్కు విధానం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు వంటివి ఇవ్వాలని ఆటోమొబైల్ తయారీ సంస్థల సంఘం సియామ్ కోరుతోంది.
- ఇదీ చూడండి:'తుక్కు పాలసీతో 'ఆటో'కు నయా జోష్'
పర్యటకం
కొవిడ్ కారణంగా భారీగా నష్టపోయిన హోటల్, రెస్టారెంట్లకు తక్కువ పూచీకత్తుతో కనీసం ఆరు నెలల పాటు మారటోరియంతో రుణాలు ఇవ్వాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరుతోంది. దేశీయంగా పర్యటకాభివృద్ధి కోసం టూరిజం కౌన్సిల్ ఏర్పాటుచేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్) అభిలషిస్తోంది.
- ఇదీ చూడండి:పర్యటక రంగానికి మద్దతు దక్కేనా?
విమానయానం
కొవిడ్ కారణంగా రెక్కలు తెగిన విమానయాన రంగం.. టర్బైన్ ఫ్యూయల్‌పై ఉన్న పన్నులను తగ్గించాలని కోరుతోంది. ఎయిర్‌పోర్టు ఛార్జీలు, పార్కింగ్, ల్యాండింగ్, నావిగేషన్ ఛార్జీలు లెవీలను తగ్గించాలని విమానయాన సేవలందిస్తున్న కంపెనీలు కోరుతున్నాయి.
ఈ-కామర్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైల్ రంగం కూడా ఈ బడ్జెట్‌పై పెద్ద ఆశలే పెట్టుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని కోరుతోంది.
- ఇదీ చూడండి:ఆశల వారధి మోస్తూ.. కరోనా కష్టాలు తీర్చేనా?