కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. ఆదాయాలు భారీగా పడిపోవడం వల్ల వారిలో చాలా మంది పేద వారిగా మారే ప్రమాదం ఉంది. కొవిడ్ వల్ల నెలకొన్న సంక్షోభం దాదాపు 100 కోట్ల మందిని పేదరికంలో నెడుతుందని ఓ నివేదిక ఇటీవల వెల్లడించింది. పేదరికం పెరిగితే సామాజిక అసమానతలు మరింత తీవ్రమవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక విధానాలపై చర్చ..
ప్రస్తుత పరిస్థితులు.. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల్లో లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
కరోనా తెచ్చిన ఈ సంక్షోభంతో.. ప్రస్తుత ఆర్థిక విధానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త కేట్ రావర్త్ 2017లో రాసిన 'డోనట్ ఎకనామిక్స్' పుస్తకంలో ప్రతిపాదించిన డోనట్ ఆర్థిక విధానం(ఎకనామిక్స్) ఈ చర్చల్లో కీలకాంశమైంది.
డోనట్ విధానం అంటే..?
డోనట్ ఆర్థిక విధానం ప్రకారం.. ప్రపంచంలో అందరి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఆర్థిక కార్యకలాపాలు ఉండాలి. ఒక వృత్తాకార పటం ద్వారా దీనిని వివరించారు రచయిత కేట్ రావర్త్. అందరి భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధి ఎక్కువ దృష్టి సారించేలా చూడటమే ఈ డోనట్ విధానం సారాశం.
సుస్థిర జీవనానికి ప్రాధాన్యం..
రెండు వృత్తాలతో మధ్యలో రంధ్రం ఉండే ఆకారం డోనట్. ఈ ఆర్థిక విధానాన్ని సూచించే పటంలో కూడా రెండు వృత్తాలు, మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. మధ్యలో ఖాళీ అనేది ప్రపంచవ్యాప్తంగా కనీస మౌలిక వసతులైన ఆహారం, నీరు, ఆరోగ్యం, రాజకీయ భావ ప్రకటన స్వేచ్ఛ లాంటివి లేని వారిని సూచిస్తుంది.
పెద్ద వృత్తం ఆవలి భాగం భూ పర్యావరణ పరిధుల్లో లేని వాటిని సూచిస్తుంది.
రెండు వృత్తాల మధ్య ఉండే ప్రాంతం(డోనట్) పర్యావరణానికి హాని కలిగించని, సామాజికంగా మెరుగైన పరిస్థితుల్లో ఉండటాన్ని తెలుపుతుంది. ఇందులోనే మానవులు జీవించాల్సి ఉంటుంది. ఖాళీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని బయట పడేయటమే 21వ శతాబ్దంలో మానవాళి ముందున్న సవాలని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.
అదే సమయంలో డోనట్ ప్రాంతంపై భారం ఎక్కువగా పడటం వల్ల వాతావరణ మార్పు, ఓజోన్ క్షీణత, నీటి కాలుష్యం, జీవ జాతులు అంతరించిపోవటం వంటి ఇతర పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయన్న విషయాన్ని ఈ విధానం సూచిస్తుంది. డోనట్ ప్రాంతంలోకి ప్రజలు ప్రవేశించి అక్కడ సుస్థిరంగా ఎలా జీవించాలి అనే విషయన్ని ఈ విధానం స్పష్టం చేస్తోంది.
మొదటి నగరం అమ్‌స్టర్‌డ్యాం...
డోనట్ ఆర్థిక విధానాన్ని అమలు చేసిన మొదటి నగరం అమ్‌స్టర్‌డ్యాం. సంవత్సరం పాటు చర్చలు కొనసాగిన అనంతరం ఏప్రిల్ 2020లో దీన్ని అమలు చేశారు. స్పష్టమైన పర్యావరణ లక్ష్యాలను ఈ ప్రాంతం నిర్దేశించుకుంది. దీనితో పాటు కార్భన్ న్యూట్రల్, నగరంలో ఉత్పత్తైన చెత్త, తదితరాలను తిరిగి ఉపయోగించే పద్ధతి, ఆర్థిక విధానాలకు సంబంధించిన ప్రణాళికలు తయారయ్యాయి.
అందరికీ ఇళ్లు..
ఈ నగరంలో అందరికీ ఇళ్లు అందించటం అనేది ప్రధాన సవాలు. ఎందుకంటే ఇక్కడ 20 శాతం మంది ఇంటి అద్దె చెల్లించిన అనంతరం మిగతా మౌలికమైన బిల్లులను చెల్లించలేని పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ అద్దెను తగ్గించేందుకు మరిన్ని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో కర్భన ఉద్గారాలు, ఇతర కాలుష్య కారకాలు వంటివి వెలువడి.. పర్యావరణ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి డోనట్ విధానంలో చెప్పిన విధంగా ఇళ్లు కట్టేందుకు సుస్థిరమైన నిర్మాణ పద్ధతులను పాటిస్తున్నారు. అదే సమయంలో కనెక్టివిటీ లాంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఈ విధానాన్ని అందరూ పాటించాలి..
అమ్‌స్టర్‌డ్యాం పాటిస్తున్న డోనట్ ప్రణాళిక అవసరం ప్రపంచానికి ఇప్పుడు ఎక్కువగా ఉందని కేట్ రావర్త్ ఇటీవల అన్నారు. వనరులను కాపాడటం, ప్రజల మౌలిక అవసరాలు తీర్చటం వంటి వాటిలో ఈ నగరం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ప్రణాళిక ప్రాధాన్యాల్లో మార్పులు చేసేందుకు ప్రపంచానికి కరోనా మహమ్మారి ఇచ్చిన అవకాశం గురించి 'ప్రపంచ ఆర్థిక వేదిక' (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 'కొవిడ్-19 రిస్క్ అవుట్‌టుక్ ఏ ప్రిలిమినరీ మ్యాపింగ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్' పేరిట విడుదల చేసిన నివేదికలో వివరించింది.
'ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చేందుకు కరోనా వైరస్ సంక్షోభం ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థల్లో కార్యకలాపాలు ప్రారంభమౌతున్నందున.. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై చర్యలను ఆలస్యం చేయటానికి బదులు.. రికవరీలో సామాజిక సమానత్వం, సుస్థిరతను భాగం చేసేందుకు అవకాశాలున్నాయి' అని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది.
ఇదీ చూడండి:వ్యవసాయ సదుపాయాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలు