కరోనా మహమ్మారి వల్ల మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు, ఆదాయలు తగ్గిపోవటం వల్ల సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల మధ్య ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మధ్యతరగతి వర్గం చాలా ఆశలు పెట్టుకుంది.
ఈ సారి బడ్జెట్ మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ ఇది వరకే స్పష్టం చేశారు. అభివృద్ధికి ఊతమందించే.. డిమాండ్ సృష్టించే రంగాలకు తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ ఊతానికి మధ్యతరగతి ప్రజలు ఆదాయ వ్యయాలు చాలా ముఖ్యం. డిమాండ్ పెంచేందుకు ఈ వర్గం కొనుగోలు సామర్థ్యం కీలకం. మరి మధ్యతరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.
ఆరోగ్య ఖర్చులపై మినహాయింపులు
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం ఆరోగ్య బీమా ప్రీమియంతో పాటు వైద్య ఖర్చులను పన్ను నుంచి మినహాయింపు తీసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు కుటుంబ సభ్యులను కూడా పరిగణనలోకి తీసుకుని గరిష్ఠంగా లక్ష వరకు ఈ పన్నుకు గణించి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. మారిన పరిస్థితుల్లో, ముఖ్యంగా కరోనా వల్ల వైద్య ఖర్చులు పెరిగాయి. సాధారణంగా కూడా ఈ వ్యయాలు ఎక్కవయ్యాయి. కాబట్టి గరిష్ఠ స్థాయికి పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను పెంపు
ఈక్విటీ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ స్థాయి వద్ద ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సంవత్సరం అనంతరం ఉపసంహరించుకుంటే వర్తించే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రస్తుతం 10 శాతంగా ఉంది. కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవటం వల్ల ఈ పన్నును పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండింటి కంటే ఎక్కువ ఇళ్లున్న వాళ్లు గృహ విక్రయం విషయంలో వర్తించే దీర్ఘకాల మూలధలన లాభాల పన్నును కూడా పెంచనున్నట్లు వారు అంచనా వేస్తున్నారు.
ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ ద్వారా షేర్ల కొనుగోలు సమయంలో విధించే పన్నును.. వాటి విక్రయం సమయంలో వసూలు చేయాలనే చర్చ కూడా ఉంది.
ట్యాక్స్ డిడక్టబుల్ ఇన్ ఫ్రా బాండ్ల ప్రవేశం
పెట్టుబడి పెట్టిన మేర పన్ను కోసం పరిగణించే ఆదాయంలో మినహాయింపు తీసుకునే వెసులుబాటు కల్పించేవే ట్యాక్స్ డిడక్టబుల్ ఇన్ ఫ్రా బాండ్లు. వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. వీటి వల్ల పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలతో పాటు మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రభుత్వానికి కావాల్సిన నిధులు సమకూరుతాయని అంటున్నారు.
ఎల్టీసీ గడువు పెంపు?
ప్రభుత్వం ప్రకటించిన ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) పథకం 2021 మార్చి 31తో ముగియనుంది. అయితే దీనిని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పన్ను స్లాబుల్లో మార్పు..
పన్ను స్లాబుల్లో మార్పు చేయాలని ప్రజలు, ముఖ్యంగా వేతన జీవులు కోరుతున్నారు. 2019 మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం రూ.5 లక్షల ఆదాయంలోపు వారికి పూర్తి పన్ను రిబేట్‌ను ప్రకటించింది. అయితే మౌలికమైన మినహాయింపు పన్నును రూ.2.5 లక్షల వద్దే ఉంచింది. గత సంవత్సరంలో కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ.. మౌలికంగా ఉన్న మినహాయింపును పెంచలేదు. అయితే చాలా కాలం నుంచి పన్ను మినహాయింపును స్థాయిని పెంచాలని డిమాండ్ ఉంది.
ప్రస్తుతం ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.50వేలుగా ఉంది. పెరిగిన వ్యయాల నేపథ్యంలో దీనిని పెంచాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
కరోనా వల్ల వేతనజీవులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనితో ఇంట్లో ఆఫీసు పనికోసం ఫర్నీచర్ కొనుగోళ్లు చేశారు. కొన్ని కంపెనీలు ఇలాంటి విషయంలో రియంబర్స్మెంట్ అందిస్తున్నాయి. దీనిపై కూడా పన్ను కట్టాల్సి వస్తోందని అందుకే డిడక్షన్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి:కొత్త బడ్జెట్లో ఆ ఊరట లభిస్తుందా?