అంతర్జాతీయంగా చైనా, అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు సహా బ్రెగ్జిట్‌పై నెలకొన్న అనిశ్చితులు మదుపరులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అందుకే సురక్షిత మదుపుపై ఆసక్తి చూపుతున్నారు ఇన్వెస్టర్లు.
ఎక్కువగా పుత్తడిపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జోరు మరింత పెరిగి... పసిడి ధరలు పెరగొచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వృద్ధి ప్రభావం
"ప్రపంచ వృద్ధి 2019లో 3.5 శాతానికి మందగిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవల అంచనా వేసింది. అందుకే ఇతర రంగాల కన్నా సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపే మదుపరులు మొగ్గు చూపే అవకాశం ఉంది. పసిడికి డిమాండు పెరిగి ధరలు ఎగబాకవచ్చు."
- వినోద్ జయకుమార్, కార్వీ కమొడిటీస్
ఎన్నికల ప్రభావం...
"భారత్‌లో బంగారం వినియోగ వస్తువుగానే చూస్తారు గానీ... బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపరు. భారత్‌లో ఎన్నికల నేపథ్యంలో తర్వాతి ప్రభుత్వంపై అంచనాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి."
- ప్రథమేశ్ మాల్యా, ఏంజెల్ బ్రోకింగ్
అధిక కొనుగోళ్లూ కారణమే
"పుత్తడి ధరలు ఇప్పటికే పెరుగుదల దిశగా కదులుతున్నాయి. ఇటీవల బంగారంలో పెట్టుబడులు పెరిగి ధరలు పెరిగాయి. వీటికి తోడు పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొనుగోళ్లలో వృద్ధి కూడా ధరలు మరింత పెరిగేందుకు ఊతం అందిచొచ్చు."
- వందన భారతీ, ఎస్ఎంఈ గ్లోబల్ సెక్యూరిటీస్
రూపాయి బలహీన పడటం బంగారం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం కాగలదని భావిస్తున్నారు నిపుణులు.