వార్షిక బడ్జెట్‌లో సామాన్యులకు ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రప్రభుత్వం. ముఖ్యంగా ఆదాయ పన్ను స్లాబులను పెంచుతూ ఊరటనిచ్చింది. పాన్ కార్డు జారీని సులభతరం చేసింది. యువతకు మేలు చేసేలా నాన్‌గెజిటెడ్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కోసం ఇకపై ఒకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. పలు వస్తువుల ధరలను పెంచింది కేంద్రం.
పద్దు 2020లో సామాన్యుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలివే....
ఆదాయ పన్ను మార్పు...
మధ్య, ఎగువ తరగతి వర్గాలకు ఊరటనిచ్చే విధంగా పన్ను రేట్లను భారీగా తగ్గించింది కేంద్రం. పన్ను స్లాబులను 4 నుంచి 7 కు పెంచింది. అయితే... పాత విధానం యథాతథంగా కొనసాగుతుందని, మినహాయింపులు వదులుకున్నవారికే కొత్త విధానం వర్తిస్తుందని మెలిక పెట్టింది.
- ఆదాయపు పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు
- ఏ విధానమో పన్ను చెల్లింపుదారులదే తుది నిర్ణయం
- రూ. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి పన్నులు యథాతథం
- పన్ను రేట్లు తగ్గించేందుకే ఆదాయపన్ను విధానం సరళీకరణ
సహకార సంఘాలకు తీపి కబురు...
సహకార సంఘాలకు శుభవార్త చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సహకార సంఘాలపై విధిస్తున్న 30శాతం పన్ను 22 శాతానికి తగ్గించారు.
వస్తువుల ధరల్లో మార్పు...
గిన్నెలు, ఫ్యాన్లు, వంట సామగ్రిపై కస్టమ్స్ సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వీటిపై 20 శాతం సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఇది సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
- దిగుమతి చేసుకున్న ఫ్యాన్లు, గిన్నెలు, వంట సామగ్రిపై కస్టమ్స్ సుంకాలు 7.5 నుంచి 20 శాతానికి పెంపు
- వైద్య పరికరాలపై నామమాత్రపు హెల్త్ సెస్
సులభంగా పాన్..
పన్ను చెల్లింపులు, ఇతరత్రా అన్ని అవసరాలకు తప్పనిసరి అయిన పాన్ కార్డు జారీ వ్యవస్థలో సమూల మార్పులు చేసింది కేంద్రం. ఇకపై విద్యార్హత పత్రాలు లాంటివి అవసరం లేకుండానే కేవలం ఆధార్‌తో పాన్ కార్డు జారీ చేయనుంది.
- ఆధార్‌ను ప్రాతిపదికగా తీసుకొని వేగంగా, సులభంగా పాన్ జారీ వ్యవస్థ ఏర్పాటు
విద్యుత్ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు..
విద్యుత్ రంగంలో సాంకేతికతను జోడిస్తూ.. సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించాలని యోచిస్తోంది కేంద్రం. ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేలా సంప్రదాయ మీటర్ల బదులు సరికొత్త స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది.
ఉద్యోగాల భర్తీకి జాతీయ ఏజెన్సీ..
నాన్‌గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ పరీక్షలను రాస్తూ వస్తోన్న యువతకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇక నుంచి అలా కాకుండా ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. త్వరలో ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు.
- నాన్‌గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష
- త్వరలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
టాక్స్హాలిడే...
ఇళ్ల నిర్మాణ రంగంలో ఎగువ, మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. టాక్స్హాలిడే కొనసాగించనుంది.
- చౌక గృహాల నిర్మాణానికి పన్ను మినహాయింపు కొనసాగింపు
గృహాలపై వడ్డీ రాయితీ పొడగింపు...
చౌక గృహాలపై ఉన్న వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాదికి పొడిగించింది కేంద్రం. గత బడ్జెట్‌లో రూ.1.50 లక్షలు వడ్డీ రాయితీని కేంద్రం ప్రకటించగా.. మరో సంవత్సరం పాటు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది.
అన్నదాతకు వరాలు...
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం అందుకు తగినట్లుగానే కేటాయింపులు జరిపింది. రైతు సంక్షేమం కోసం 16 సూత్రాలను ప్రకటించింది.
- ఆకాంక్షల భారత్ కోసం 16 సూత్రాలతో కార్యాచరణ ప్రణాళిక
- 2020-21లో రూ.15లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని నిర్ణయం
- ఇళ్లకు కుళాయి నీళ్లు ఇచ్చేందుకు రూ.3.6లక్షల కోట్లు కేటాయింపు