కరోనా మహమ్మరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధి ఊతమందించేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ) ఛార్జీలకు బదులుగా.. అంతే మొత్తంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఓచర్లను జీఎస్టీ వర్తించే.. ఆహారేతర వస్తువులను కొనేందుకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
ఉద్యోగులు 12 శాతం, అంతకన్నా ఎక్కువ జీఎస్టీ ఉన్న వస్తువులను కొనుగోలు చేయొచ్చని కేంద్రం వెల్లడించింది. జీఎస్టీ నమోదిత ఔట్లెట్లలో.. డిజిటల్ మోడ్ ద్వారానే ఈ కొనుగోళ్లు జరపాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఏమిటీ ఎల్టీసీ?
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమకు నచ్చిన ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లేందుకు, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ప్రయాణ రాయితీలను ప్రకటిస్తుంటుంది. దీనినే ఎల్టీసీ అంటారు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడం క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఓచర్ల రూపంలో ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. ఈ మొత్తాన్ని 2021 మార్చి 31 లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఎల్టీసీకి బదులు కేంద్రం రూ.5,675 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు రూ.1,900 కోట్లు చెల్లించనున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
ఈ విధానంతో డిమాండ్ రూ.19,000 కోట్లు, సగం రాష్ట్రాలు ఇదే మార్గదర్శకాలను అనుసరిస్తే మరో రూ.9,000 కోట్ల డిమాండ్ పెరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
వడ్డీ లేని పండుగ అడ్వాన్స్..
డిమాండ్ పెంచేందుకు ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులందరికీ.. రూ.10 వేలు వడ్డీ లేని పండుగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఈ మొత్తాన్ని 10 ఈఎంఐలలో చెల్లించొచ్చని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. పండుగ అడ్వాన్స్ కోసం రూ.4,000 కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు.