బడ్జెట్ వస్తుంటే మదుపర్లకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. పన్ను రూపంలో తమ ఆదాయాలు కొట్టుకుపోకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారేమోనని ఎదురుచూస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న తమ ప్రతిపాదనలను తీర్చాలని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరుకుంటోంది. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును తీసివేయాలని ప్రభుత్వం భావిస్తుండడం కూడా మార్కెట్ వర్గాల్లో ఆనందం నింపుతోంది. ఇక ఈ దశాబ్దం.. గత దశాబ్దం కంటే మార్కెట్‌కు బాగుంటుందని మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంటున్నారు. మొత్తం మీద ఆశల పల్లకీలోనే అందరూ ఉన్నారు.
2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక మూలధన లాభాల(ఎల్‌టీసీజీ) పన్నుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానిని తొలగిస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రభావం పడుతుందో చెప్పాలంటూ ప్రభుత్వం కొంత మంది పన్ను సలహాదార్లు, నిపుణులను సలహా కోరింది. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి గల అవకాశాలు; నమోదిత కంపెనీలపై ఎల్‌టీసీజీ పన్నును తొలగించే ప్రతిపాదనను పన్ను సలహాదార్లు సూచించినట్లు ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
ఏడాది నుంచి రెండేళ్లకు..
అదే సమయంలో ‘దీర్ఘకాలం’కు ఉన్న నిర్వచనాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచే అవకాశం ఉందని ఈ చర్చలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌టీసీజీపై 10 శాతం పన్ను ఉంది. సెప్టెంబరులో న్యూయార్క్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అనుగుణంగా ఈ పన్నును తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ), ఇతర మదుపర్లు ప్రధాని హామీ నేపథ్యంలో ఎల్‌టీసీజీని తొలగిస్తారన్న అంచనాలతో ఉన్నారు. పలువురు ఎఫ్‌పీఐలు ప్రభుత్వానికి ఎల్‌టీసీజీని తొలగించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌టీసీజీ, ఇతర పన్ను అంశాల కారణంగా పెట్టుబడుల ప్రణాళికలకు దూరంగా ఉన్నట్లు పలువురు విదేశీ మదుపర్లు చెబుతున్నారు.
ద్రవ్యలోటు కీలకం
చాలా వరకు దేశాల్లో ఎల్‌టీసీజీ పన్ను లేదని నిపుణులు అంటున్నారు. అదీకాక ఎల్‌టీసీజీని తీసుకురావడం ద్వారా ఏటా రూ.40,000 కోట్లను పొందాలని ప్రభుత్వం భావించినప్పటికీ పన్ను వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ నేపథ్యంలో ఎల్‌టీసీజీని తొలగించడం లేదంటే రెండేళ్ల పాటు గడువును పొడిగించడం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యలోటును లక్ష్యంలో ఉంచడం ప్రభుత్వానికి ఇపుడు కీలకంగా ఉంది. గతేడాది నవంబరు చివరకే పూర్తి ఏడాది లక్ష్యం కంటే 13 శాతం అధికంగా ద్రవ్యలోటు రూ.8.07 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను వసూళ్లు కూడా అంచనాల కంటే దిగువనే ఉన్నాయి.
భారీ ప్రకటనలు ఉండకపోవచ్చు
రాబోయే బడ్జెట్లో భారీ ప్రకటనలేమీ ఉండకపోవచ్చని.. అయితే ప్రభుత్వం కొన్ని చర్యలైతే తీసుకోవచ్చని మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంటున్నారు. రిటైల్ మదుపర్లు బడ్జెట్ తర్వాత మార్కెట్లోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అంచనా వేశారు. బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను గడువును రెండేళ్లకు పెంచాలని, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు పన్ను మినహాయింపునివ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక డివిడెండ్లపై పన్ను సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. టాటా సన్స్-మిస్త్రీ వివాదం ముగిసినట్లేనని చంద్రశేఖరన్ విధానాల పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన అన్నారు. రంగాల వారీగా చూస్తే ఫార్మా రంగంపై బులిష్‌గా ఉన్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో భారత్ 9-10% వృద్ధి చెందవచ్చని అందుకే గత దశాబ్దంతో పోలిస్తే ఈ దశాబ్దంలో మార్కెట్ మెరుగైన ప్రతిఫలాలు ఇస్తుందని ఆయన అంచనా కట్టారు.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఏంకావాలంటే..
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను మరింత వృద్ధి చేయడం కోసం 17 అంశాలను భారత మ్యూచువల్ ఫండ్‌పరిశ్రమ(యాంఫీ) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ద్వారా రిటైల్ మదుపర్లకు ఫండ్‌లు మరింత దగ్గరకాగలవని యాంఫీ అభిప్రాయపడుతోంది. అవేంటంటే..
- డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(డీఎల్‌ఎస్‌ఎస్)ను తీసుకొచ్చి దీని కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు అందించాలి. పన్ను ఆదానందించే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల తరహాలో అయిదేళ్ల లాకిన్ పీరియడ్ వీటికి ఉండాలి. ఇది చిన్న మదుపర్లు బాండ్ మార్కెట్లోకి రావడానికి వీలు కల్పిస్తుంది.
- ఫండ్ యూనిట్లను ‘స్పెసిఫైడ్ లాంగ్ టర్మ్ అసెట్స్’ కింద నోటిఫై చేసి దీర్ఘకాలిక మూలధన లాభాలపై మినహాయింపునివ్వాలి. దీని వల్ల స్థిరాస్తి విక్రయం ద్వారా వచ్చిన లాభాల్లో కొన్ని అయినా క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి.
- ఫండ్ యూనిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలందించే యులిప్‌లలలో పెట్టుబడులకు ఏకరూప పన్ను విధానం ఉండాలి.
- మ్యూచువల్ ఫండ్స్‌లు అందించే పింఛను పథకాలు, జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)లకు ఒకే విధమైన పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- డెట్ మ్యూచువల్ ఫండ్‌లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును తగ్గించాలి.
- స్వల్పకాల మూలధన లాభాలపై విధించే టీడీఎస్‌ను ఎన్నారైలకు 15 శాతానికి తగ్గించాలి.
- ఫండ్‌లు జారీ చేసే ఇన్‌ఫ్రా డెట్ ఫండ్‌లకు, ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే ఇన్‌ఫ్రా డెట్ ఫండ్‌లకు ఏకరూప పన్ను విధానం ఉండాలి.
- ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్‌లు, ఈటీఎఫ్‌లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) రెండు సార్లు పడకుండా చూడాలి.