భారత దేశాన్ని 'ఆత్మనిర్భర్'గా తీర్చిదిద్దే ప్రక్రియను.. 2021 బడ్జెట్ వేగవంతం చేస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. దీర్ఘకాలానికి సంబంధించిన వృద్ధిని సాధించేందుకు.. కరోనా సంక్షోభంలోనూ సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. సంక్షోభం ద్వారా వచ్చిన అవకాశాలను ఉద్దీపనలు, సంస్కరణలతో సద్వినియోగం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
2021 బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రసంగించారు నిర్మల. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. ఆర్థికపరంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చే విధంగా ఉన్నాయన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 1న రూ. 34.5 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. అన్ని రంగాల వారికి అండగా నిలిచినట్టు పేర్కొన్నారు.
మోదీ స్ఫూర్తితో..
జన్‌సంఘ్ సమయం నుంచి దేశంపై, భారతీయులపై భాజపా నమ్మకం ఉంచిందన్నారు. భారత యువత, వ్యాపార, నిర్వాహక నైపుణ్యంపై విశ్వాసం ఉండటం వల్లే.. వేరే దేశాల నుంచి విధానాలు తెచ్చుకుని ఇక్కడ అమలు చేయలేదన్నారు.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ సీఎంగా మోదీ చేసిన సేవల నుంచి స్ఫూర్తిపొందే 2021 బడ్జెట్‌ను రూపొందించినట్టు వెల్లడించారు.
ఈ తరుణంలో విపక్షాలపై విమర్శలు చేశారు నిర్మల. మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని.. బడా పెట్టుబడిదారుల కోసం కాదన్నారు.
ఇదీ చూడండి:- వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు