కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ... దేశ జీడీపీ ద్రవ్యలోటుపై 0.6 శాతం మేర ప్రభావం చూపనున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రకటించిన ఉద్దీపన చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల మేర లోటు ఏర్పడుతుందని వెల్లడించింది.
"ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యల ఫలితంగా దేశ జీడీపీపై పడే ప్రభావం 0.6శాతం(సుమారు 1.29లక్షల కోట్లు) మాత్రమే. అయితే అవసరం ఉన్నవారికి రుణాలు పొందడానికి వీలుగా ప్యాకేజీ సాయం అందిస్తుంది. గురువారం ప్రకటించిన రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రభుత్వ వ్యయం సుమారు రూ.14,500-రూ.14,750 లక్షల కోట్లు. గురువారం నాటి ఈ ప్యాకేజీ ద్రవ్య లోటుపై 0.07 శాతం మేర ప్రభావం చూపుతుంది."
-భారతీయ స్టేట్ బ్యాంక్ నివేదిక
కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సమన్వయం ఉండే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతను తాజా సంక్షోభం బయటపెట్టిందని నివేదిక పేర్కొంది.
కార్మికుల సంక్షేమానికి..
కార్మిక చట్టాల్లో మార్పులను సరిగా అమలు చేయగలిగితే.. దేశ కార్మికుల స్థితిగతులను మార్చవచ్చని ఎస్బీఐ నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన అవగాహనతో పనిచేయాలని నొక్కి చెప్పింది.