2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తయారీపై కసరత్తు ముమ్మరం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నేడు సామాజిక రంగ నిపుణులతో భేటీ అయ్యారు. చర్చల్లో భాగంగా విద్యా, మహిళల భద్రత, పరిశుభ్రత, శిశు పోషణకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని పలువురు సూచించారు.
ఆరోగ్య సదుపాయాల కల్పన, ఉచిత మందులు, వైద్య పరీక్షల సదుపాయాలకు నిబంధనలపై పలు సూచనలు చేశారు. వైద్య పరికరాలపై పన్నుల హేతుబద్ధీకరణ, ఆరోగ్య రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాభివృద్ధి, వృథా నీటి పునర్వినియోగానికి ప్రోత్సాహకాలు వంటివి అందులో ఉన్నాయి.
విద్యా ప్రమాణాల పెంపు, యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన, వైద్య ఖర్చుల తగ్గింపు, మహిళా సాధికారత, మానవాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు సీతారామన్.
ప్రధానంగా ఆరోగ్యం, విద్యా, సామాజిక భద్రత, పింఛన్, మానవాభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరిగింది.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ, విధాన పరిశోధన కేంద్రం అధ్యక్షురాలు యామిని అయ్యర్, హెల్పేజ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి రోహిత్ ప్రసాద్, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక కనూంగో హాజరయ్యారు.
ఇదీ చూడండి: నష్టాలు మిగిల్చిన 'చమురు' భయాలు