భౌతికంగా బంగారం కొనుగోలుకు ప్రత్యామ్నాయమైన.. సార్వభౌమ గోల్డ్ బాండ్లు(ఎస్జీబీ) సోమవారం నుంచి ప్రజలకు సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 2020-21 సిరీస్ 7 సౌర్వభౌమ బంగారు బాండ్లను అక్టోబర్ 16 వరకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
ఇవీ బాండ్ల లాంటివే..
ఎస్‌జీబీలు ప్రభుత్వం అందించే బాండ్ల లాంటివే. ప్రభుత్వం తరఫున వీటిని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జారీ చేస్తుంది. ఎస్జీబీలనూ గ్రాముల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. గ్రాము బంగారానికి రూ.5,051గా రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.
ఆన్లైన్ ద్వారా వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకుని, ఆన్లైన్లోనే పేమెంట్ చేసే వారికి రూ.50 డిస్కౌంట్ లభించనుంది. వీరికి ఒక గ్రాము రూ.5,001 కే లభిస్తుంది.
2.5 శాతం రాబడి..
దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.
ఒక వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?
ఒక వ్యక్తి కనీసం 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హిందూ అవిభాజ్య సంస్థలకు కూడా 4కిలోల పరిమితి ఉంది. ట్రస్ట్‌లకు 20కిలోల గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇష్యూలలో కలిపి ఈ స్థాయి వరకు కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినవి కూడా దీని పరిధిలోకి వస్తాయి.
పన్ను ప్రయోజనాలు..
వీటిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. టీడీఎస్ కూడా ఉండదు. ఈ బాండ్లను బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. వీటిని బ్యాంకులలో సెక్యూరిటీలుగా ఉంచి రుణాలను కూడా పొందవచ్చు. సాధారణ బంగారు రుణంపై తీసుకున్న విలువ ప్రకారమే వీటిపై కూడా రుణం తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలదే తుది నిర్ణయం.
వీటిని గ్రాముల ప్రకారం పార్ట్ రిడీమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మొత్తం ఒకే సారి పెట్టుబడి వెనక్కి తీసుకోకుండా కొంచెం కొంచెంగా ఉపసంహరించుకోవచ్చు.
ఎక్కడెక్కడ లభిస్తాయి..
ఈ బాండ్లు బ్యాంకులు(స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల వద్ద తప్ప), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్లు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ)ల వద్ద అందుబాటులో ఉంటాయి.
ఇదీ చూడండి:ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, ఫెస్టివల్ అడ్వాన్స్!