ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా సీతారామన్ రేపటి(శుక్రవారం) జీఎస్టీ మండలి భేటీకి తొలిసారి అధ్యక్షత వహించనున్నారు. రేపు జరగబోయే జీఎస్టీ మండలి 35వ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు.
అక్రమ లాభార్జన నిరోధక శాఖ (ఎన్ఏఏ) కొనసాగింపుపై నిర్ణయం, సింగిల్ పాయింట్ రీఫండ్ వ్యవస్థ ఏర్పాటు సహా వ్యాపారుల ఈ-ఇన్వాయిస్ జారీపై ఇటీవల విధించిన నిబంధనల అంశాలు చర్చకు రానున్నాయి.
జీఎస్టీ ఎగవేతలను గుర్తించేందుకు జీఎస్టీ ఈ-వే బిల్లు వ్యవస్థను ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసే అంశంపై సీతారామన్ సమాలోచనలు చేయనున్నారు. వీటి అనుసంధానం 2020 ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉన్న అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్)ల ఆదేశాలను పునర్విచారణ జరిపే అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఏర్పాటుపై సమీక్ష చేయనుంది జీఎస్టీ కౌన్సిల్.