దేశంలో ఆర్థిక రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. వలస కార్మికుల నుంచి నగదు బదిలీ పెరగడం, ఉద్యోగంలో చేరాక ఈపీఎఫ్‌ఓ చేసే నమోదులు.. లాక్‌డౌన్ ముందు స్థాయులకు చేరడం దీనికి నిదర్శనమని పేర్కొంది. జన్‌ధన్ ఖాతాల సంఖ్య కూడా 60 శాతం పెరిగి 41 కోట్లకు పైగా చేరగా.. వాటిల్లో నగదు జమలు కూడా వృద్ధి చెందాయని మంగళవారం విడుదల చేసిన నివేదిక వివరించింది.
నివేదిక ముఖ్యాంశాలు..
- ఏప్రిల్‌లో లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికుల నగదు బదిలీలు (రెమిటెన్సెస్) బాగా తగ్గాయి. జూన్, జులైలో కాస్త పుంజుకున్నాయి. సెప్టెంబరులో అయితే ఈ ఏడాది ఫిబ్రవరి (కరోనాకు ముందు) స్థాయికి చేరుకున్నాయి. దీన్నిబట్టి వలస కార్మికులు భారీ స్థాయిలో తిరిగి తమ పనుల్లోకి చేరారు. భారీ వర్షాల కారణంగా పనులు నిలిచిపోగా ఆగస్టులో ఈ చెల్లింపులు కొంత తగ్గాయి.
- ఫిబ్రవరిలో ఈ చెల్లింపులు 112గా (సాధారణ సూచీ 100) ఉన్నాయి. ఏప్రిల్‌లో 85కు తగ్గినా.. మేలో 94కు; జూన్‌లో 105కు చేరుకున్నాయి. జులైలో 103కు పరిమితమై.. ఆగస్టులో 97కు తగ్గాయి. అయితే సెప్టెంబరులో 115కు పెరిగాయి.
- ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో ఏప్రిల్-ఆగస్టు 2020లో కొత్తగా 25 లక్షల ఈపీఎఫ్ చందాదారులు చేరారు. ఇందులో 12.4 లక్షల మంది తొలి సారి జీతాలు తీసుకుంటున్నవారే. 2019-20లో 110.4 లక్షల కొత్త ఈపీఎఫ్ చందాదారులు చేరారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 29 లక్షలు తక్కువ.
- అక్టోబరు 14 నాటికి జన్‌ధన్ ఖాతాలు 41.05 కోట్లుగా ఉండగా.. వాటిల్లో జమ రూ.1.31 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్ నుంచి దాదాపు 3 కోట్ల ఖాతాలు తెరవగా.. మొత్తం డిపాజిట్లలో వృద్ధి రూ.11,060 కోట్లుగా ఉంది. కరోనా కారణంగా ఈ ఖాతాల సంఖ్య 60 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో సగటు జమ రూ.3400కు పెరగ్గా.. సెప్టెంబరు కల్లా అది రూ.3,168కి తగ్గింది. అక్టోబరులో రూ.3,185కు పెరిగింది. ప్రభుత్వం సెప్టెంబరు నెల వరకు జన్‌ధన్ మహిళా ఖాతాల్లో రూ.500 జమ చేసింది.
- ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణాల్లో జన్‌ధన్ ఖాతాల వల్ల నేరాలు/దొంగతనాలు తగ్గాయి. బంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్ణాటకల్లోనూ సానుకూల ప్రభావమే కనిపించింది.