కరోనా సంక్షోభం వల్ల ఎదురైన అనుభావాలను దృష్టిలో ఉంచుకుని.. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు పెంచింది కేంద్రం. 2021-22కు గానూ దాదాపు రూ.2,23,846 లక్షల కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (రూ.94,452) కేటాయించిన మొత్తంతో పోలిస్తే.. ఇది 137 శాతం అధికం.
ఆత్మ నిర్భర ఆరోగ్య పథకం..
కొత్తగా ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.64 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఈ మొత్తాన్ని వచ్చే ఆరేళ్లలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచడం, కొత్తవి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. ఇప్పటికే అమలులో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇది అదనం అని వెల్లడించారు.
'ఈ పథకం ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లోని ఆరోగ్య కేంద్రాల సామర్థ్యం పెరుగుతుంది. కొత్త రకం వ్యాధుల గుర్తింపు, నివారణకు అవసరమైన.. ప్రస్తుత జాతీయ వైద్య సంస్థలను బలోపేతం చేయడమేగాక కొత్త సంస్థలు ఏర్పాటుకు ఉపకరిస్తుంద'ని పేర్కొన్నారు.
అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆరోగ్య పరీక్షా కేంద్రాలు 11 రాష్ట్రాల్లో 3,382 ఆరోగ్య కేంద్రాలు, 602 జిల్లాలు, 12 జాతీయ వైద్య సంస్థల్లో అత్యవసర చికిత్స బ్లాక్‌లు ఏర్పాటు చేయాలనేది కొత్త పథకం ఉద్దేశమని వివరించారు.
టీకా పంపిణీకి రూ.35 వేల కోట్లు..
వైరస్‌ల నిర్మూలనకు అవసరమైన వ్యాక్సినేషన్‌కూ బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టీకా పంపిణీ కోసం రూ.35వేల కోట్లు ప్రతిపాదించారు.
"భారత్‌లో తయారైన న్యూమోకోకల్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరమితమైంది. దీన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం. తద్వారా ఏడాదికి 50వేలకుపైగా శిశుమరణాలను తగ్గించవచ్చు. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం రూ. 35వేలకోట్లు కేటాయిస్తున్నాం. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి: