కరోనా వైరస్ ప్రభావంతో గాడితప్పనున్న ఆర్థిక వ్యవస్థను.. సరైన రీతిలో నడిపేందుకు కీలక ప్రకటనలు చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ). మొండి బకాయిల నిబంధనలను సడలించడమే కాకుండా రుణదాతల డివిడెండ్ చెల్లింపులు, రివర్స్ రెపోరేటు శాతం తగ్గింపు నిర్ణయాలను తీసుకుంది. ఆర్బీఐ విధివిధానాలపై ఆర్థిక వేత్తలతో సహా సంస్థలు, వ్యాపార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. రివర్స్ రెపోరేటు తగ్గింపు సరైన నిర్ణయమేనని.. కానీ బ్యాంకులు రిస్కు తీసుకునేందుకు సిద్ధమైతేనే రేట్ల కోతతో ఫలితం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సరైన నిర్ణయమే..
4 శాతంగా ఉన్న రివర్స్ రెపోరేటును పావుశాతం (25 పాయింట్లు) తగ్గించింది ఆర్బీఐ. కేంద్రీయ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు అందుబాటులోకి వచ్చే నిధులను పెరగనున్నాయి. వాటిని ఉత్పాదక రంగాల్లో రుణాలు, పెట్టుబడుల రూపంలోకి మళ్లించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచుకోనున్నాయి.
"రివర్స్ రెపో రేటు తగ్గింపు సరైనదే. అయితే ప్రైవేటు సెక్టార్లలోకి నిధుల ప్రవాహం పెరిగిందా లేదా అని చూడాలి."
-మదాన్ సబ్నవిస్, కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త
అందుకోసమే ఆంక్షల సడలింపు..
నిధులు తమ వద్ద ఉండిపోకుండా బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రుణ కార్యకలాపాలు ఊపందుకునే దిశగా.. ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని డీబీఎస్ బ్యాంక్ ఆర్థికవేత్త రాధిక రావు వెల్లడించారు.
"మార్చి నెలలో 30 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ కేంద్రీయ బ్యాంక్ వద్ద ఇంకా నిధులు ఉండిపోయాయి. ప్రస్తుత నిర్ణయం ద్వారా కొంతమేరకు రుణాలు ఇచ్చే అవకాశాలు పెరగనున్నాయి. అయితే బ్యాంకులకు నష్టభయం కూడా కలిగే అవకాశం ఉంది."
-రాధిక రావు, డీబీఎస్ బ్యాంక్
అయితే రివర్స్ రెపోరేటును ఇంకా తగ్గిస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు రాధిక రావు.
ఎస్బీఐ నిపుణుల అభిప్రాయం..
ఆర్బీఐ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ) నిబంధనల్లో తాజాగా ప్రకటించిన సడలింపులతో.. బ్యాంకులకు, వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు.
"మూలధన వ్యయ సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతమున్న ఆర్బీఐ 90 రోజుల నిబంధనపై పునఃసమీక్షించాలి. ఓ ఆస్తిని ఎన్పీఏగా పరిగణించిన అనంతరం రుణగ్రహీతకు మరో రుణదాత నుంచి నిధులు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు 90 రోజుల ఎన్పీఏ గడువును 180 రోజులకు పెంచాలి."
-సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు
అయితే 180 రోజుల గడువును ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చి.. రాబోయే రెండేళ్లలోగా 90 రోజుల నిబంధనను తిరిగి అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీ అందుకే..
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ. 50వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది ఆర్బీఐ. ఈ నిధులను బాండ్లు, కమర్షియల్ పేపర్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా విపణిలోకి అందుబాటులోకి తీసుకురానుంది.
క్రిసిల్ అభిప్రాయం..
ఆర్బీఐ ప్రకటించిన ఉద్ధీపనల ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక రంగం, గృహ రుణ సంస్థలు, చిన్నతరహా ఆర్థిక సంస్థలకు ఉపశమనం లభించనుందని చెప్పారు క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్.
"ప్రస్తుత ఆర్బీఐ ప్రకటన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మారటోరియం సదుపాయం కల్పించేదిగా ఉంది. తాజా నిర్ణయం ద్వారా ఈ రంగంలో నిధుల ప్రవాహం పెరుగుతుంది."
-క్రిసిల్ రేటింగ్స్ సంస్థ
తాజా నిర్ణయం ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. సూక్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు రుణాలు ఇచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది డెలాయిట్.
వ్యాపారాలకు మేలు..
ఆర్బీఐ తాజా ఉద్దీపనలతో బ్యాంకులు రుణాలు ఇవ్వగలిగే అవకాశాలు పెరుగుతాయని.. తద్వారా నిధుల లేమితో వ్యాపార సంస్థలు ఇబ్బంది పడే అవకాశం ఉండదని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనాతో తలెత్తే సంక్షోభానికి ఆర్బీఐ పరిష్కారం చూపిందని వెల్లడించింది ఇండియా ఇంక్ సంస్థ.
సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉన్న రంగాలకు చేయూత ఇచ్చే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పారు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ.
మూలధన వ్యయం పెంచాలి..
బ్యాంకింగ్ నిబంధనల్లో తాజా సడలింపుల వల్ల బ్యాంకులు కరోనా ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని ఎఫ్ఐసీసీఐ అధ్యక్షురాలు సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే బ్యాంకులపై ఆధారపడకుండా వ్యాపారాలకు మూలధన వ్యయాన్ని పెంచాలని తెలిపారు.
ఇదీ చూడండి: ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్బీఐ 2.0 మంత్రం