రిటైల్ నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధంలో అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేటు రంగ బ్యాంక్ యాక్సిస్‌పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి మళ్లీ కొవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని అంచనా వేసింది.
కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటం వల్ల వివిధ సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగడం కారణంగా రిటైల్ రుణ చెల్లింపుల సామర్థ్యం తగ్గిందని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ రుణాల విభాగాధిపతి సుమిత్ బాలి వెల్లడించారు.
‘నెలవారీగా రుణ చెల్లింపులు మెరుగవుతున్నాయి. అయినా ప్రస్తుత, మార్చి త్రైమాసికాల్లో రిటైల్ ఎన్‌పీఏలు అధికంగా నమోదు కావచ్చు. 2021 ఏప్రిల్ నుంచి ఇవి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంద’ని ఆయన వివరించారు. ‘సెప్టెంబరు వరకు రుణ మారటోరియం సదుపాయం ఉండటం వల్ల చాలా మంది రుణ గ్రహీతలు దాన్ని వినియోగించుకున్నారు. అక్టోబరు నుంచి రుణ చెల్లింపులు చేస్తున్నారు. అయితే అధిక శాతం మంది రుణ పునర్నిర్మాణానికి (లోన్ రీస్ట్రక్చరింగ్) దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విండో డిసెంబరు 31 వరకు తెరిచి ఉండటం వల్ల ఈ నెలాఖరుకు సమగ్ర వివరాలు తెలుస్తాయి. కొత్త రుణాలకొస్తే కొవిడ్ పూర్వ స్థితికి చేరుకున్నాం. అయితే రిస్కు ఎక్కువగా ఉన్న క్రెడిట్ కార్డులపై జారీ చేసే రుణాల సామర్థ్యం 60-70 శాతంగానే ఉంద’ని సుమిత్ తెలిపారు.
ఇదీ చూడండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర