యెస్ బ్యాంక్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బ్యాంకుపై విధించిన మారటోరియం రేపు సాయంత్రం నుంచి ఎత్తివేస్తున్న క్రమంలో సేవలన్నీ అందుబాటులోకి రానున్నట్లు బ్యాంకు వెల్లడించింది. డిపాజిటర్లు తమ ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లను ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది. అదనపు నిధులు అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌బీఐ కూడా ప్రకటించింది. బ్యాంకులో నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ అడాగ్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో షేరు ధర కూడా సోమవారం ఒక్క రోజే బీఎస్‌ఈలో 45% మేర పెరిగింది.
ఖాతాదారులు బుధవారం సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చని యెస్ బ్యాంకు ప్రకటించింది. ఈ నెల 5న ఆర్‌బీఐ యెస్ బ్యాంక్‌పై మారటోరియం విధించి ఒక్కో ఖాతాదారుడు రూ.50,000కు మించి నగదు ఉపసంహరణ చేయకుండా పరిమితి విధించింది. తొలుత ఏప్రిల్ 3 వరకు మారటోరియం విధించినా, ప్రస్తుతం యెస్ బ్యాంక్‌లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని, రేపు సాయంత్రం 6 గంటల నుంచి మారటోరియం ఎత్తివేసేందుకు గత శనివారమే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్‌వార్డ్ ఆర్‌టీజీఎస్/నెఫ్ట్/ఐఎంపీఎస్ ఆధారిత లావాదేవీలతోపాటు ఔట్‌వార్డ్ నెఫ్ట్/ఐఎంపీఎస్/ఆర్‌టీజీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని, మారటోరియం విధించడానికి ముందు ఈ సేవలకు పరిమితులు ఎలా ఉండేవో అలానే కొనసాగుతాయని బ్యాంకు వెల్లడించింది. శాఖల్లో నిర్వహించే లావాదేవీల్లో ఎలాంటి పరిమితులు ఉండవని తెలిపింది. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు కూడా ఉపసంహరించుకోవచ్చని, వీటికి ప్రామాణిక ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపింది. చెక్‌ల క్లియరింగ్ సేవలు మాత్రమే ప్రస్తుతానికి పునరుద్ధరించడం లేదని, అలాగే ఫారెక్స్ కార్డ్ వినియోగించే ఖాతాదారుల సేవలు తదుపరి ప్రకటన వెలువడేంత వరకు అందుబాటులోకి రావని స్పష్టం చేసింది.
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఇతరుల మీద కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూపు (అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీకి కూడా సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని అనిల్ ఈడీ నుంచి మినహాయింపు కోరారు. యెస్ బ్యాంకుకు తమ గ్రూపు కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రుణాలు తిరిగి చెల్లిస్తామని గత వారమే అనిల్ అంబానీ ప్రకటించడం గమనార్హం.
ఎఫ్‌పీఐలు, సంస్థాగత మదుపర్ల ఆందోళన
యెస్ బ్యాంక్ షేర్ల ట్రేడింగ్ పరిమితులపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనూహ్య నిర్ణయం ప్రకటించడంపై ఎఫ్‌పీఐలు, సంస్థాగత మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ఠంగా 25 శాతం షేర్లను మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతించడంపై వారు పెదవి విరుస్తున్నారు.
వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం కోసమే..
‘యెస్ బ్యాంకులో వివిధ బ్యాంకులు పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం తప్ప పెట్టుబడులపై ప్రతిఫలాలు (ఆర్‌ఓఐ) ఆశించి కాద’ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు. ఎస్‌బీఐతో పాటు మరో 7 ఆర్థిక సంస్థలు కలిపి గత వారం సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడుల్ని యెస్ బ్యాంకులోకి చొప్పించిన సంగతి తెలిసిందే.
ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్
డిపాజిటర్లు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు
యెస్ బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక అనుకున్న ప్రకారమే జరుగుతోందని, డిపాజిటర్లు మార్చి 18 సాయంత్రం 6 గంటల తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అదనపు నిధులు అవసరమైతే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్