కేంద్రప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భారీ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,76,051 కోట్ల రూపాయలను కేంద్రానికి అందించాలని నిర్ణయం తీసుకుంది. ద్రవ్యలోటు పెరగకుండా ఆర్థిక మందగమనాన్ని నిరోధించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ దిశగా అడుగులు వేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎకానమిక్ కాపిటల్ ఫ్రేమ్‌వర్క్ గుర్తించిన రూ. 1,23,414 కోట్లను డివిడెండ్ రూపంలో అందిస్తోంది. సర్‌ప్లస్ రిజర్వు పేరిట రూ.52,637 కోట్లు.. మొత్తం రూ. 1,76, 051 కోట్లను కేంద్రానికి అందజేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఊహించని నిర్ణయం
ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ఆర్బీఐ సహాయం జవసత్వాలు నింపనుంది. రికార్డు స్థాయిలో మొత్తాన్ని ప్రకటించడం... ఊహించని పరిణామమని ఆర్థికరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యలోటును 3.3 శాతం లోపే నియంత్రించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గతవారం ఆర్థికవృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలను ప్రకటించారు నిర్మలా సీతారామన్.
కమిటీ నివేదిక తర్వాత
ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బ్యాంక్. ఉర్జిత్ పటేల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆర్బీఐకి మోదీ ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆర్బీఐ, ప్రభుత్వానికి మధ్య ఎంత మొత్తంలో మిగులు మూలధన నిల్వలను బ్యాంకు అట్టిపెట్టుకోవచ్చనే అంశమై చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే 2018 నవంబర్‌లో మిగులు నిల్వల అంశాన్ని సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ బోర్డు. శక్తికాంతదాస్ సెంట్రల్ బ్యాంక్ బాధ్యతలు చేపట్టాక ఈ కమిటీ ఏర్పాటైంది.
ఇదీ చూడండి: 'సీతమ్మ' వరాలతో ఈ వారం లాభాల జోరే!