రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2020 ఏడాది చివరి విధాన సమీక్షపై ద్రవ్యపరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం వాయిదా పడింది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 మధ్య నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ. స్వతంత్ర సభ్యుల నియామకం ఆలస్యం కావండం వల్ల ద్రవ్య విధాన కమిటీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది.
" సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1న జరగాల్సిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం రీషెడ్యూల్ అయింది. ఎంపీసీ సమావేశ తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం."
- ఆర్బీఐ
కమిటీలోని స్వతంత్ర సభ్యులను నియమించే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం ఆయా సభ్యులు నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. 2016, అక్టోబర్‌లో అమలులోకి వచ్చింది ఎంపీసీ. కమిటీలోని ముగ్గురు స్వతంత్ర సభ్యుల పదవీ కాలం గత నెలలో పూర్తయింది. ఇప్పటి వరకు కొత్త వారిని నియమించలేదు ప్రభుత్వం. కమిటీ నియమాల ప్రకారం సమావేశాలకు కనీసం నలుగురు సభ్యులు తప్పనిసరిగా ఉండాలి.
ఎంపీసీ సభ్యుల నియామకానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఎంపిక ప్యానల్‌ను ఈ ఏడాది తొలినాళ్లలో ఏర్పాటు చేసింది కేంద్రం. ఇందులో ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్ సూచించిన వారిని ఎంపీసీలో స్వతంత్ర సభ్యులుగా నియమించనుంది కేంద్రం.
ఎంపీసీ చివరిసారిగా 2020, ఆగస్టు 4 నుంచి 6వ తేదీల మధ్య సమావేశమైంది.
ఇదీ చూడండి: ఆర్బీఐ సమీక్ష: వడ్డీ రేట్లు యథాతథం!