తయారీ రంగం ఆశ్చర్యకరరీతిలో పుంజుకుని.. జీడీపీని -7.5 శాతం క్షీణతకు పరిమితం చేసింది. అయితే ఇది కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల వ్యయాలను భారీగా తగ్గించుకోవడం వల్ల సాధ్యమై ఉండొచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జులై-సెప్టెంబరు(2020-21)లో భారత జీడీపీ 7.5 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ఎక్కువ క్షీణిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా కట్టాయని ఎస్‌బీఐలోని ఎకోరాప్ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. 'లాక్‌డౌన్ కారణంగా తొలి త్రైమాసికంలో భారీగా కుంగిన తయారీ రంగం రెండో త్రైమాసికానికల్లా సానుకూల గణాంకాలు వెలువడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత త్వరగా అది ఎలా కోలుకుందో అర్థం కావడం లేద'ని ఎకోరాప్ నివేదికలో ఆయన రాసుకొచ్చారు.
ఇవీ కారణాలు..
"రూ.500 కోట్ల వరకు టర్నోవరు ఉండే కంపెనీలు భారీగా వ్యయాలను తగ్గించుకున్నాయి. ఉద్యోగుల వ్యయాల్లో 10-12 శాతం తగ్గించాయి. దీంతో కార్పొరేట్ జీవీఏ(స్థూల విలువ జోడింపు) గణాంకాలు బలంగా నమోదయ్యాయి. ఈ విషయం తయారీ గణాంకాలు రాణించేలా చేసి ఉండొచ్చు. భవిష్యత్‌లో వినియోగం తగ్గినా.. నిల్వలు పెరిగినా తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చ"ని ఆ నివేదికలో పేర్కొన్నారు. 'సేవా రంగం కరోనా ముందు స్థాయిలకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థ తెరచుకున్న వెంటనే భారీగా వస్తువుల రవాణా జరగడం; వర్కింగ్ ఫ్రం హోం కారణంగా కమ్యూనికేషన్, బ్రాడ్‌క్యాస్టింగ్ రంగాలు భారీగా రాణించడం ఇందుకు కారణంగా నిలిచాయా?' అని అందులో ప్రశ్నించారు.
ఇదీ చూడండి:ఆర్థిక వృద్ధిలో పుంజుకున్న భారత్