కరోనా వల్ల ఆర్థికంగా చాలా మందిపై ప్రభావం పడింది. ఉద్యోగాలు, వేతన కోతను ఎదుర్కోవాల్సి వచ్చింది. వైద్య ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయాలు తగ్గిపోవటం వంటి కారణాలతో రుణాలపై చాలా మంది ఆధారపడ్డారు. సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక ప్రణాళిక గాడితప్పింది. మహమ్మారి సమయంలో ముందు నుంచి ప్రణాళికతో ఉన్న వారు కొంత తక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరైతే ఖర్చులు పెరిగిపోవటం వల్ల పెట్టుబడులను ఆపేశారు.
కరోనా మరోసారి విజృంభిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అత్యవసరి నిధి అనేది చాలా ముఖ్యమని, దాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నించాలని వారు చెబుతున్నారు. దీని కోసం నెలవారీగా కొంత పొదుపు చేయాలంటున్నారు.
రుణాల చెల్లింపునకు ప్రాధాన్యం
మహమ్మారి సమయంలో వైద్య ఖర్చులు, ఇంటి ఖర్చులు తదితరాల కోసం రుణాలను తీసుకున్నట్లయితే వాటిని తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ఇతరత్రా కార్యకలాపాలకు వీలు లేదు కాబట్టి వాటి ఖర్చును ఉపయోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. పొదుపును కూడా పెంచుకునేందుకు ప్రయత్నించాలని పేర్కొంటున్నారు.
కరోనా ఎప్పటికి తగ్గుతుందో తెలియదు. దీనివల్ల అనిశ్చిత పరిస్థితి ఇంకా కొనసాగనుంది. కొందరి దగ్గర పెట్టుబడులు ఉన్నప్పటికీ.. కావాల్సిన సమయంలో నగదు సమకూరకుండా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉన్న సాధనాల్లో పెట్టుబడులను కొనసాగించాలి. స్వల్ప కాలంలో ద్రవ్యలభ్యత లేకుండా దీర్ఘకాల ప్రణాళికలు వేసుకోవద్దని వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
ప్రస్తుత సమయంలో 20 నుంచి 25 శాతం లిక్విడిటీ ఉన్న సాధనాల్లో పెట్టుబడులు ఉండాలని సూచిస్తున్నారు. లిక్విడ్ ఫండ్లు, స్వల్ప కాల ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివి ఉత్తమమంటున్నారు.
అంతర్జాతీయ ఈక్విటీ..
ప్రస్తుతం కరోనా ప్రభావం వేరువేరు దేశాల్లో వేర్వేరు విగా ఉంది. భారత్ లాంటి దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనితో ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సవరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇదే సమయంలో కొన్ని దేశాల్లో టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థపై సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఒక దేశంలోని ఈక్విటీ, ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్లయితే రిస్కు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలి. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వారు లాక్ డౌన్ సమయంలో నిర్భయంగా ఉన్నారు.
ఈక్విటీ మార్కెట్లలో హెచ్చుతగ్గులున్నప్పటికీ దీర్ఘకాలం దృష్ట్యా పెట్టుబడి కొనసాగించాలని సూచిస్తున్నారు. 10 శాతం కంటే ఎక్కువ బంగారంపై పెట్టుబడి పెట్టకూడదని అంటున్నారు.
బీమా తప్పకుండా..
ఆరోగ్య బీమాకు ఉన్న ప్రాధాన్యం చాలా మందికి కొవిడ్ మూలంగా స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇప్పటికీ ఆరోగ్య బీమా లేని వారు తప్పకుండా పాలసీ తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్‌కు వర్తించే ప్రత్యేక పాలసీని కూడా తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
'వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారు చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నారు. ఖర్చులు తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంది. తగ్గిన ఖర్చులను పొదుపు, పెట్టుబడి చేయాలని సూచిస్తున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మదుపు చేయాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై సానుకూలంగా ఉన్నామని, ఈక్విటీలలో పెట్టుబడులు కొనసాగించాలని సలహా ఇస్తున్నారు.
ఇదీ చదవండి:రుణ దరఖాస్తు తరచూ తిరస్కరణకు గురవుతోందా?