ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టటం ఓ ప్రధాన మార్గం. అయితే స్టాక్స్ ఎక్కువ రిస్కుతో కూడినవి కాబట్టి వీటిలో పెట్టుబడులు పెట్టే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. వీటిలో మదుపు చేసే ముందు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
పెట్టుబడుల ఏవైనా వాటితో లక్ష్యం అనేది ఉండాలి. స్వల్ప నుంచి మధ్య కాలంలో ప్రయాణాలు, పిల్లల చదువులు, పెళ్లి తదితర స్వల్ప నుంచి మధ్యకాల లక్ష్యాలు ఉండవచ్చు. అంతేకాకుండా భవిష్యత్త్ తరాలకు సంపదను అందించేందుకు దీర్ఘకాల లక్ష్యాలు ఉండవచ్చు.
అయితే ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారు తప్పకుండా ముందే నిర్ణయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు రిస్కును సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలవుతుందని చెబుతున్నారు. ఫలితంగా తగిన స్టాక్స్ ఎంచుకుని మెరుగైన రాబడులను సాధించుకోవచ్చని వారు అంటున్నారు.
రిస్కు, వ్యవధి..
రిస్కు తీసుకునే సామర్థ్యం ఎంత అన్నది కూడా ముందే నిర్ణయించుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల ఎలాంటి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలన్న దానిపై స్పష్టత ఉంటుందని వారు చెబుతున్నారు. పెట్టుబడిని కొనసాగించే వ్యవధి కూడా చాలా ముఖ్యమైనది. వ్యవధిని బట్టి రాబడులు ఆధారపడి ఉంటాయి.
పరిశోధన..
ట్రాకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే చాలా అవగాహన కావాలి. ఏ ధర వద్ద కొనుగోలు చేయాలి, ఏ ధర వద్ద పెట్టుబడిని ఉపసంహరించుకోవాలి, ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది చాలా ముఖ్యం. స్టాప్ లాస్ ను కూడా నిర్ణయించుకోవటం ద్వారా నష్టాలు ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అవగాహన..
ఈక్విటీలలో పెట్టుబడికి సిప్, మ్యూచువల్ ఫండ్లు తదితర అవకాశాలు ఉన్నాయి. చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు అడ్వైజర్లను సంప్రదించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్టాక్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
స్టాక్స్‌కు సంబంధించి ఏఏ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలి? అనేది ప్రధానాంశం. మార్కెట్లో ఊహగానాలు కూడా ఉన్న నేపథ్యంలో.. పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇవే కాకుండా స్టాక్స్‌లో పెట్టుబడికి సంబంధించినంత వరకు చాలా అంశాలు ఉంటాయి. అన్నింటిపై అవగాహన ఏర్పరచుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:సంక్షోభంలోనూ ఆర్థిక భరోసాకు ఐదు సూత్రాలు..